దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం

దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం నెలకొంది. నాయిని మరణించి నాలుగు రోజులకే ఆయన సతీమణి అహల్య చనిపోవడం వారి ఇంట్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆమె వయస్సు 68 సంవత్సరాలు. కరోనా సోకిన అహల్యకు చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో చికిత్సపొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వారి కుటుంబంలోను, కార్యకర్తల్లోను తీవ్ర విషాదాన్ని నింపింది.
మొదట నర్సింహారెడ్డితోపాటు ఆయన సతీమణికి కరోనా సోకింది. దీంతో వీరిద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొద్దిరోజులకే కరోనా నెగిటివ్ అని రిపోర్టు కూడా వచ్చింది. కానీ కరోనా వ్యాధి కారణంగా ఇద్దరికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నాలుగు రోజులక్రితం నాయిని చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషాద ఘటన నుంచి బయటపడకముందే ఆయన సతీమణి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అహల్య మృతిపట్ల సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.
కరోనా మహమ్మారి నాయిని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారని, అనుకున్న సమయంలో ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఈనెల 22వ తేదీన నాయిని నర్సింహారెడ్డి తుదిశ్వాస విడిచారు. చివరిసారిగా చూసుకునేందుకు ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్ లో ఉన్న అహల్య ను అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చారు. ఈ హృదయ విదారక మైనటువంటి దృశ్యం అందర్నీ కలచివేసింది. కదలేనిస్థితితో ఉన్న అహల్య భర్తను చివరిసారిగా చూసి కన్నీటి పర్యంతమైంది. నాయిని మరణంతో ఆమె మరింత కుంగిపోయింది. ఒకపక్క ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మరో పక్క భర్త చనిపోయాడు అన్న మనోవేదనతో చికిత్స పొందుతు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకినట్లుందని తెలుస్తోంది. దీంతో నాయిని దంపతులు కరోనా మహమ్మారికి బలయ్యారు. అంతేకాదు నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com