NDSA: కమిటీలపై కమిటీలు వేయడమేంటి...?

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి తమ సిఫార్సుల ప్రకారం కాకుండా మరో నిపుణుల కమిటీని వేసి గ్రౌటింగ్ చేయడమేంటని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది. తాము సూచించని ప్లింత్ శ్లాబ్ గ్రౌటింగ్‌ను ఎలా చేస్తారని దీని వల్ల జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షల ఫలితాలు సరిగా వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉందని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ వ్యాఖ్యానించగా, కమిటీలపై కమిటీలు వేయడమేంటని, ఇలాగైతే పనులు ముందుకెలా వెళ్తాయని ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ అన్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తాము చేసిన సూచనల మేరకు ఇప్పటివరకు జరిగిన పనులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ.. తెలంగాణ నీటిపారుదల శాఖ బృందంతో ఢిల్లీలో సమావేశమైంది. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్, నిపుణుల కమిటీ ఛైర్మన్, ఇతర సభ్యులు... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ నాగేందర్‌రావు, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు చేసిన పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన పనుల్లో పూర్తయిన, ఇంకా చేయాల్సిన వాటిని వివరించారు. అయితే తమ కమిటీకి సమాంతరంగా మరో కమిటీ వేసి, తాము సిఫార్సు చేయని పనులను చేయడమేంటని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రశ్నించారు. కాళేశ్వరంపై న్యాయవిచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్‌కు సాంకేతికంగా సాయపడేందుకు నిపుణుల కమిటీని మే 22న ఏర్పాటు చేశారు. ఈఎన్సీ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఐఐటీ, ఎన్‌ఐటీకి చెందిన నిపుణులున్నారు. ఈ కమిటీ జూన్ ఒకటిన బ్యారేజీలను పరిశీలించి తొమ్మిది పనులు చేయాలని సూచించింది. ఆయా సిఫార్సులను కమిటీ కన్వీనర్... సంబంధిత ఇంజినీర్లకు పంపి అమలు చేయాలని కోరారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు పనులు చేస్తామని చెబుతుండగా, మరో కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై ప్రశ్నించడంతోపాటు దీనివల్ల జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షల ఫలితాలు సరిగా వచ్చే అవకాశం లేదని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డలో ఎగువన, దిగువన సీకెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్ పరిస్ధితిని అంచనా వేసే పరీక్షను పూర్తి చేశామని నీటిపారుదల శాఖ అధికారులు నివేదించగా, తాము సూచించిన పార్లల్ సీస్మెక్ పద్ధతిలో చేయలేదని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com