Medigadda Report: బ్యారేజీలో లోపాలు- కేంద్ర ప్రభుత్వ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ

Medigadda Report:  బ్యారేజీలో లోపాలు-  కేంద్ర ప్రభుత్వ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ
7వ బ్లాక్ మొత్తం మళ్లీ నిర్మించాలని నివేదిక

మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత, నిర్వాహణ లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగిపోయిన కారణాల్ని బట్టి మొత్తం బ్యారేజ్‌నే పునర్మించాల్సిన అవసరముందని తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా పునరుద్ధరించేవరకు రిజర్వాయల్‌ నీటిని నింపకూడదని సూచించింది. ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే డిజైన్లు, నిర్మాణ పద్దతులు కలిగినందున, వాటన్నింటిలో యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు అవసరమని సూచించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పునాది కుంగుబాటుపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగిపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జలశక్తిశాఖ విచారణ కోసం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్‌ 24న మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. మరుసటి రోజు హైదరాబాద్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై..ప్రమాదానికి గల కారణాలను సమీక్షించింది. పిల్లర్ల కుంగుబాటుపై అధికారులు, ఇంజినీర్లతో చర్చించింది. ప్రాథమికంగా పిల్లర్ల కిందున్న ఇసుక కదలటం వల్లే ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన కమిటీ లోతైన పరిశీలన కోసం రాష్ట్ర అధికారుల నుంచి 20 అంశాలకు సంబందించిన సమాచారాన్ని కోరింది. కేంద్రం అడిగిన జాబితాలోని 20కి 11 అంశాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డేటాను సమర్పించిందన్న కమిటీ అది అసంపూర్తిగా ఉందని తెలిపింది.


క్షేత్రస్థాయిలో డ్యాం పరిశీలన, అధికారులతో సమీక్ష, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చిన ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు ప్రధాన కారణం...ప్లానింగ్, డిజైన్, నాణ్యతా, నిర్వాహణలో వైఫల్యాలేనని పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల..పిల్లర్స్ సపోర్ట్ బలహీనపడిందన్న కమిటీ....ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని అభిప్రాయపడింది. బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా రూపొందించి స్థిరమైన కట్టడంగా నిర్మించారని నివేదికలో తెలిపింది. ప్లానింగ్ చేసిన విధంగా డిజైన్ జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది.2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి.. సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలు, లాంచింగ్ అప్రాన్లను నిర్వాహకులు సరిగా పరిశీలించలేదని, నిర్వాహణ చేపట్టలేదని తెలిపింది. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడి.. వైఫల్యానికి దారితీసిందని పేర్కొంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలూ ఇదే విధమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నందున ఆ బ్యారేజీలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులున్నాయని అభిప్రాయపడింది.అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఉన్నాయని గుర్తుచేసిన కమిటీ.. పైపింగ్ సమస్యల్ని గుర్తించేందుకు రెండు బ్యారేజీలను మేడిగడ్డతోపాటే యుధ్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story