CM REVANTH: నెట్‍ఫ్లిక్స్ రాకతో నా కల నిజం కాబోతోంది

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సాంకేతిక మరియు వినోద రంగాల్లో మరింత ప్రాధాన్యం సంపాదిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ప్రసిద్ధ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయం ప్రారంభం కావడం రాష్ట్రానికి ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ హైటెక్ సిటీలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ అన్ని విధాలుగా అవకాశాలు కల్పించే నగరమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షప్రియో,, ప్రముఖ సినీ నటుడు రానాతదితరులు హాజరయ్యారు. ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యాలయం, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక, మీడియా మరియు వినోద రంగాల అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుందని భావిస్తున్నారు.
దేశంలోనే రెండోది
హైటెక్ సిటీలోని క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్–ఏలో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారతదేశంలో ముంబై తర్వాత ఇది రెండో కార్యాలయం కావడం ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహించే సాంకేతిక కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలో ఉన్న బలమైన టెక్ మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన యువత మరియు ఐటీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలే ఈ నిర్ణయానికి కారణమని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రధానంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎడిటింగ్, యానిమేషన్, రెండరింగ్ వంటి సాంకేతిక సేవలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రంగాల్లో నిపుణులైన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నెట్ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్ ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌గా మరింత బలపడుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఉన్న ఆసక్తిని గుర్తు చేసుకున్నారు. కాలక్రమేణా సినిమా పరిశ్రమలో జరిగిన మార్పులు ఆశ్చర్యకరమని ఆయన చెప్పారు. ఒకప్పుడు సాంకేతిక పరంగా పరిమితులు ఉన్నప్పటికీ ఇప్పుడు అత్యున్నత సాంకేతికతతో సినిమాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. ఉదాహరణగా బాహుబలి, కల్కి, RRR, అరుంధతి వంటి చిత్రాలను ఆయన ప్రస్తావించారు. ఈ సినిమాలు భార చిత్రసీమలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మహనీయులైన ఎన్టీఆర్, ఏఎన్నార్లను ఈ సందర్భంగా ఆయన స్మరించారు. వారి కృషి వల్లే హైదరాబాద్ సినిమా పరిశ్రమకు కేంద్రబిందువుగా మారిందని తెలిపారు. ఇప్పుడు అదే నగరం అంతర్జాతీయ స్థాయి వినోద రంగ సంస్థలను కూడా ఆకర్షిస్తోందని అన్నారు. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్‌కు రావడం అంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలోనే తమ దృష్టి హాలీవుడ్‌పైనే ఉందని చెప్పానని, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ రాకతో ఆ కల నెరవేరుతున్నట్లుగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో సినిమా, మీడియా మరియు టెక్నాలజీ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
