Suryapet: చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత.. ఓ తల్లి చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్..

Suryapet: చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత.. ఓ తల్లి చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్..
Suryapet: పదహారేళ్లు దాటని పిల్లలు సైతం గంజాయి లాంటి వ్యసనాలకు అలవాటు పడి బానిసవుతున్నారు.

Suryapet: చెడు వ్యసనాల బారిన పడి యువత చిత్తవుతోంది. పదహారేళ్లు దాటని పిల్లలు సైతం గంజాయి లాంటి వ్యసనాలకు అలవాటు పడి బానిసవుతున్నారు. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయికి బానిసైన తన కుమారుడిని దారిలోకి తెచ్చుకునేందుకు ఓ మహిళ గట్టిగా బుద్ది చెప్పింది.

కొడుకు మంచి ఉద్యోగం సాధించి ఉన్నత‌ స్థానంలో ఉండాల‌ని ఆరాట‌పడింది ఆ మహిళ. కానీ గంజాయికి బానిసయ్యాడు. కళ్లముందే ఆశలు ఆవిరవుతుంటే చూడలేకపోయింది. దీంతో ఊహించని రీతిలో కుమారుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం కొట్టి చితకబాదింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు రెండేళ్లుగా గంజాయికి బానిసయ్యాడు.

ప్రతి రోజూ గంజాయి సేవించి ఇంటికి వస్తున్నాడు. గంజాయిని మానుకోవాలని అతని తల్లి నచ్చజెప్పింది. కానీ తీరు మారలేదు. దీంతో కొడుకును ఎలాగైనా దారికి తెచ్చుకోవాల‌ని డిసైడైంది. ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి మరో మహిళ సాయంతో కొడుకు కళ్లల్లో కారం కొట్టింది. దాదాపు 10 రోజులుగా తన కొడుకు ఇంటికి రావడం లేదని ఆమె తెలిపింది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఇలా చేశానని వెల్లడించింది.

గంజాయి సరఫరా చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కోదాడలో గంజాయి ముఠాల ఆట కట్టించాలని.. తన కుమారుడిని ఈ గంజాయి బారి నుంచి కాపాడాలని కోరింది ఆ తల్లి.తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు నిత్యం దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. అయితే కొందరు అక్రమార్కులు పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని సీక్రెట్‌గా తీసుకొట్టి అన్యంపుణ్యం తెలియని పిల్లలకు అలవాటు చేస్తున్నారు.

మొగ్గలోనే వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో యువత శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. తమ అక్రమ సంపాదన కోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్థులకు గంజాయిని అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు అక్రమార్కులు.

ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రధానంగా కుటుంబంలో పరిస్థితులు సక్రమంగా లేకపోవటం, చెడు స్నేహాలు, ప్రేమ వైఫల్యాలు.. వ్యసనాలకు బానిసలవటానికి కారణాలని అంటున్నారు. పాఠశాల, కాలేజీ నుంచి ఇంటికొచ్చిన పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో పేరెంట్స్‌ గమనించాలని.. మంచిమాటలు చెప్పి వారిలో మార్పు తేవాలని.. లేదంటే కాస్త కఠినంగా వ్యవహరించైనా వారిని దారికి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు..

Tags

Read MoreRead Less
Next Story