తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపికపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా పీసీసీ పైనే చర్చించుకుంటున్నారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక హాట్ టాఫిక్ గా మారింది. కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఎటూ తెల్చకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నేతల పోటాపోటీతో పీసీసీ నియామకంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో నేతల అభిప్రాయాల మేరకు పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. అన్నట్లుగానే ఆ ప్రక్రియను పూర్తి చేశారు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. కానీ ఇంత వరకు పీసీసీ ఎవరనేది మాత్రం క్లారిటీ రాలేదు. అటు కొత్త రథసారథిపై క్యాడర్‌లోనూ ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఇదే తరహాలో సాగదీస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అన్ని స్థాయిల్లో పూర్తయినట్టు గానే .. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా అన్ని స్థాయిలో పూర్తయి బంతి హైకమాండ్ కోర్టుకు చేరింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ లో అధ్యక్షుడి ఎంపిక మినహా అన్ని స్థాయిల్లో పదవుల భర్తీ జరిగిపోయింది. దీంతో రాష్ట్ర కమిటీలో అద్యక్షుడు లేకుండా.. ఏర్పాటైన కమిటీ కాస్తా తలకాయ లేని శరీరంలా మారింది.
తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 60 వేల ఓట్లు సాధించి శివసేన రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. 52 వేల ఓట్లు సాధించిన రాజీవ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 22 వేల ఓట్లు సాధించి పోరికే సాయి మూడో స్థానంలో నిలిచారు. ముగ్గుర్నీ ఢిల్లీ పిలిపించుకుని ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా పూర్తి చేసింది అధిష్ఠానం. 60 వేల కోట్లు సాధించిన శివసేన రెడ్డి నీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించడం లాంఛనప్రాయంగానే కనబడుతోంది. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
అయితే పీసీసీ చీఫ్ ఎంపికకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికకు లింకు ఉండడం వల్లే అధికారిక ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లుగా టాక్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ముందే పూర్తి చేస్తే శివసేన రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. పీసీసీ చీఫ్‌ను కూడా రెడ్డి సామాజిక వర్గం నేతకే ఇస్తే పార్టీలో కొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది.. అందుకే పీసీసీ చీఫ్ ప్రకటన తర్వాతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనేది హైకమాండ్ ప్రకటించనుంది. కారణాలు ఏవైనా ఓవైపు పీసీసీ చీఫ్ ఎంపిక పై ఉత్కంఠ.. మరోవైపు యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ ముగిసినా అధ్యక్షుడు ఎవరో తేలకపోవడంతో పార్టీ క్యాడర్‌లో రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com