Hyderabad : న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధం

Hyderabad : న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధం
డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల కోసం ప్రత్యేక చెక్‌పోస్టులు

కొత్త సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. నయాసాల్‌ జోష్‌ను మరింత పెంచేలా పలు సంస్థలు, వ్యాపార సముదాయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. న్యూఇయర్‌ ఈవెంట్లతో జంట నగరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వేడుకలు సజావుగా జరిగేలా పోలీసులు పడక్బందీ చర్యలు చేపట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అర్థరాత్రి దాటాక ఔటర్‌రింగ్‌ రోడ్డుతోపాటు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల కోసం ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. నూతన ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు యువత ఉత్సాహంగా సిద్ధమైంది. న్యూ ఇయర్‌ దృష్ట్యా హైదరాబాద్‌, సైబరాబాద్ పరిధిలో ఫైఓవర్లు, పలు రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై రాత్రి 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించరు. యువత ఎక్కువగా ట్యాంక్ బండ్ వద్ద వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోనూ వాహనాలు దారి మళ్లించనున్నారు. డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలు, ట్రిపుల్‌ రైడింగ్‌, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేయనున్నారు.

భాగ్యనగరంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే ప్రత్యేక డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. 31 ట్రాఫిక్‌ పోలీసు ఠాణాల పరిధిలో విస్తృతంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారి డ్రంకన్‌డ్రైవ్‌ తరహాలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అనుమానితుల మూత్రనమూనా తీసుకొని ఐదు నిమిషాల్లో మాదకద్రవ్యాలు తీసుకున్నది లేనిది అక్కడే నిర్ధారిస్తారు. పబ్‌లు, క్లబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, హోటళ్ల నిర్వాహకులకు పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకల్లో డ్రగ్స్‌ వాడినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాసరెడ్డి యువతకు సూచించారు. శాంతిభద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని మరో గంటపాటు పొడిగించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గ్ కారిడార్‌లో అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు చివరి రైలు బయల్దేరనుంది. మద్యం సేవించిన వారు, దురుసుగా వ్యవహరించే వ్యక్తులపై మెట్రో స్టేషన్ల వద్ద నిఘా ఉంటుందని మెట్రో రైల్‌ MD NVS రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story