NEW YEAR: నయా సాల్ వేడుకలకు నగరం సిద్ధం

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. 2026కి స్వాగతం పలకడానికి నగరమంతా వెలుగులు, అలంకరణలు, వేడుకల సందడితో కళకళలాడుతోంది. ఐటీ హబ్‌ల నుంచి పాతబస్తీ వరకు, స్టార్ హోటళ్ల నుంచి సాధారణ కాలనీల వరకు కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. యువత, కుటుంబాలు, పర్యాటకులు—అందరిలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పట్ల ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు ఇప్పటికే ప్రత్యేక న్యూఇయర్ ప్యాకేజీలతో సిద్ధమయ్యాయి. లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో న్యూఇయర్ పార్టీలకు భారీగా బుకింగ్‌లు నమోదవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులు, యువత ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. గతేడాదికి భిన్నంగా ఈసారి ప్రత్యేక థీమ్‌లతో ఈవెంట్ల నిర్వాహకులు ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా డీజేలు, లైవ్ పెర్ఫార్మెన్స్లు, ఫైర్వర్క్స్ ఉండనున్నాయి. మాస్కరేడ్, కార్నివాల్లతో పాటు నటీనటులు ఈవెంట్లలో సందడి చేయనున్నారు. మ్యాజిక్ షో, ఫ్యాషన్ షోలు, సెలబ్రిటీ డీజే, సెలబ్రిటీ లైవ్ బ్యాండ్, న్యూ ఇయర్ సెల్ఫీ బూత్, న్యూ ఇయర్ కౌంట్డౌన్లే కాకుండా ప్రీమియం ఈవెంట్లలో బెస్ట్ కపుల్ అవార్డులు సైతం ఇవ్వనున్నారు.
మరోవైపు నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వంటి ప్రముఖ ప్రాంతాలు న్యూఇయర్ ఈవ్ రాత్రి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. సరస్సు పరిసరాల్లో వెలుగుల అలంకరణలు, రాత్రివేళ సుందర దృశ్యాలు నగరానికి కొత్త శోభను తీసుకొస్తున్నాయి. ఈ సందర్భంగా టూరిజం శాఖ కూడా పలు కార్యక్రమాలను రూపొందించినట్లు సమాచారం. చాలా చోట్ల మైదానాల్లో ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 31న రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగనున్నాయి. పలు ప్రీమియం ఈవెంట్లలో ప్రత్యేకంగా వీఐపీ, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేరుతో కూర్చునే స్థానాలను నిర్ణయించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రంతా నగరవ్యాప్తంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ, మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలను మోహరించనున్నారు. ప్రజలు సహకరించి ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

