కోతకు గురైన రోడ్డు.. ఎన్‌హెచ్ 44కు బదులుగా ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి..

రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఊహించని స్థాయిలో 25 నుంచి 32 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల జనం పీకల్లోతు నీళ్లలో ఇరుక్కుపోయారు.
హైదరాబాద్‌కి వచ్చే ప్రధాన రహదారులు కూడా దెబ్బతిన్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురయ్యింది. అప్ప చెరువు తెగడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో 44వ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోవటంతో.. 44వ జాతీయ రహదారికి బదులుగా ఔటర్ రింగ్ రోడ్డును ఉపయోగించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు.
హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు, శంషాబాద్, కర్నూల్, బెంగళూరు వైపు వెళ్లేవారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
మెహిదీపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేను కూడా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై రాకపోకల నిషేధం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. బుధ,గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నింటికీ సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com