NIMAJJAN: భక్తజన నీరాజనాల మధ్య.. గంగమ్మ ఒడికి గణనాథుడు

భాగ్య నగరంలో గణేషుడి నిమజ్జనం ప్రక్రియ వైభవంగా సాగింది. భక్తిజన నీరాజనాల మధ్య.. జైబోలో గణేష్ నినాదాల మధ్య... డప్పు వాయిద్యాల మోతల మధ్య వినాయకుడు గంగమ్మఒడికి చేరాడు. వేలాది గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. 50 వేలకుపైగా గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయగా.. నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. . జీహెచ్ఎంసీ ఆరు జోన్లలో ఇప్పటి వరకు 2,07,257 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా కూకట్‌పల్లిలో 55,572 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఖైరతాబాద్‌లో 38,212, శేరిలింగంపల్లిలో 35,325, ఎల్బీనగర్లో 33,047, సికింద్రాబాద్‌లో 26,540, చార్మినార్‌లో 18,561 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.
శోభాయమానంగా బడా గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జన శోభాయాత్ర భక్తి ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. 69 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర నిర్విఘ్నంగా పూర్తి అయింది. 71వ ఏడాది జరుపుకుంటున్న ఈ గణేశోత్సవం, లక్షలాది భక్తులను ఆకర్షించింది. శోభాయాత్ర ఉదయం 7:44 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం పూర్తి అయింది. లక్షలాది మంది భక్తులు గణేశుడికి వీడ్కోలు పలికారు. గంగమ్మఒడికి సాగనంపారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తుతో "విశ్వశాంతి మహాశక్తి గణపతి" థీమ్‌తో రూపొందించారు. విగ్రహం చుట్టూ పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇవి శోభాయాత్రకు అదనపు ఆకర్షణను జోడించాయి. శోభాయాత్ర ఖైరతాబాద్ మండపం నుంచి సెక్రటేరియట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్‌లోని క్రేన్ పాయింట్ నంబర్ 4 వద్దకు చేరుకున్న తరవాత నిమజ్జనం పూర్తి అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com