Nirmal District : వీఆర్ఏలకు డ్యూటీల వివాదంపై స్పందించిన కలెక్టర్..!

Nirmal District : టెన్నిస్ ఆడుతున్న కలెక్టర్‌కు సహాయకులుగా ఉండాలంటూ.. VRA లకు ఆదేశాలు జారీ చేయడం నిర్మల్ జిల్లాలో వివాదాస్పదమైంది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ క్రీడల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఆయన ప్రతిరోజూ టెన్నిస్ ఆడుతారు. అలా టెన్నిస్ ఆడే సమయంలో ఆయనకు బంతులు అందించేందుకు గానూ రోజుకు ముగ్గురు VRA లు అందుబాటులో ఉండాలంటూ.. ఉన్నతాధికారులు స్పెషల్ డ్యూటీ వేశారు.
నూతన రెవెన్యూ చట్టం రాకతో ఉద్యోగాలు కోల్పోయిన VRA, VRO లను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని సర్కారు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను మరో రకంగా అర్థం చేసుకున్న అర్బన్ తహసీల్దార్... కలెక్టర్ సేవలో రోజుకు ముగ్గురిని వాడుతూ ఉత్తర్వులిచ్చారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఈ ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కలెక్టర్ గారి సొంత పనులకు ప్రభుత్వ సిబ్బందిని వాడడం ఏంటని అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
దీంతో అధికారులు నాలుక కరచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా కలెక్టర్ ముషారఫ్ అలీకి కూడా చేరడంతో ఆయనే స్వయంగా దీనిపై వివరణ ఇచ్చారు. అసలు అలాంటి ఆదేశాలు ఇవ్వాలని తానెప్పుడూ చెప్పలేదని.. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న తాను ఇలా ప్రభుత్వ సిబ్బందిని వ్యక్తిగత పనులకు వాడుకోవడానికి వ్యతిరేకిని అంటూ కలెక్టర్ వివరణ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com