TS: తెలంగాణ పురపాలికల్లో అవిశ్వాసల అలజడి

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పురపాలికల్లో అవిశ్వాసాలు మరింత జోరందుకున్నాయి. ఇందుకు అంతర్గత కారణాలేవైనప్పటికీ. ఛైర్మన్‌ల ఒంటెద్దు పోకడలే ప్రధానంగా కారణాలని కౌన్సిలర్లు తేల్చి చెబుతున్నారు. నిధులు అభివృద్ధికి వినియోగించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలూ.. అసంతృప్త కౌన్సిలర్ల నుంచి వినిపిస్తున్నాయి. అసంతృప్త కౌన్సిలర్లు సొంతపార్టీ ఛైర్మన్‌లపైనే.. తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులోభాగంగా మహబూబ్‌నగర్ పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌పై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 36మంది అవిశ్వాసాన్ని సమర్ధిస్తూ ఓటేశారు. 49వార్డులుండగా.. అందులో మూడింట రెండో వంతు అంటే 32 మందికి పైగా మద్దతు అవసరంకాగా.. 36మంది ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లైంది. బీఆర్‌ఎస్ నేతలు శతవిధాలా ప్రయత్నిచినా.. అధికార పార్టీ నేతలు.. కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను గద్దె దించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ శిరీష, వైస్ చైర్మన్ పద్మాలపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. 34మంది కౌన్సిలర్లకు గాను 33మంది హాజరయ్యారు. తీర్మానానికి 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపగా, మరో నలుగురు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో అవిశ్వాసం నెగినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పురపాలికలో 12 మంది కౌన్సిలర్లకు 8మంది అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు తీర్మానపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. మిగితా ఏడుగురు సభ్యుల గైర్హాజరుతో.. మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అప్పడు కూడా కావాల్సినంతమంది సభ్యులు ఓటింగ్‌కు రాకపోవడంతో.. అవిశ్వాసం వీగిపోయినట్లుగా... ఆర్వో ప్రకటించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పాలకపక్షంలోని ఛైర్మన్ కుర్చీ కోసం.. చాలాకాలం నుంచి సాగుతున్న కుమ్ములాట.. చివరికి ఈనెల 30న అవిశ్వాస తీర్మానం చేపట్టే వరకు వచ్చింది. పురపాలికలో 24 వార్డులుండగా.. 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో గుంటి రజనీకిషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు . వారిపై అవిశ్వాసాన్ని కోరుతూ.. జనవరి 2న కలెక్టర్‌కు 14 మంది సభ్యులు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా సహకార సంఘం బ్యాంకు ఛైర్మన్ నాగభూషయ్యకు కూడా పదవీగండం ఏర్పడింది. అధ్యక్షుడిగా ఉన్న వి.వెంకటాయపాలెం ప్రాథమిక సహకార సంఘంలో.. ఆయనపైనే ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సంఘం సభ్యులు 13మంది ఉండగా.. వారిలో 11మంది తీర్మానానికి అనుకూలంగా మద్దతిచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు.. ఫలితాలు వెల్లడించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com