MODI: తెలంగాణ ప్రజల కలలు చిధ్రం
తెలంగాణ ప్రజల కలల్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చిధ్రం చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశంలో 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్న ప్రధాని... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రగతి పథంలో దూసుకెళ్తున్నామన్నారు. ఈసారి కూడా బీజేపీ సర్కారుని అధికారంలోకి తెచ్చి ప్రజలు ఆశీర్వదించాలని కోరిన ప్రధాని.. దళితులను కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని ఆరోపణలు గుప్పించారు. నాగర్‌కర్నూల్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని.. తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు ముచ్చట గొలుపుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ రోజ్‌షో బ్రహ్మాండంగా సాగిందని ప్రజల ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేనన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందన్న ప్రధాని.. పదేళ్లుగా బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు తమవంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. అణగారిన వర్గాలను అనాదిగా కాంగ్రెస్ అణచివేస్తోందన్న ప్రధాని... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా హస్తం అవమానించిందన్నారు. కేసీఆర్ కూడా కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారన్న ప్రధాని... దళితుడినే తెలంగాణ తొలి సీఎం అంటూ మోసపుచ్చారన్నారు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ప్రజలందరి సహకారం కావాలని... తప్పు చేసిన వారిని ఎవర్నీ వదలబోమని మోదీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జగిత్యాల జరగనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
‘‘తెలంగాణలో ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటిన్నర మందికి బీమా కల్పించాం. 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించాం. 80 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ధి పొందారు. భాజపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకే ఎక్కువ మేలు జరిగింది. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోంది. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. యాదాద్రిలో చిన్న పీట వేసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా అవమానించింది. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేశారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎం చేస్తామని మాట తప్పారు. కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారు’’ అని మోదీ విమర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com