TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇక నామినేటెడ్‌ పదవుల జాతర

TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇక నామినేటెడ్‌ పదవుల జాతర
పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన, టికెట్లు రాని నేతలకు మాత్రమే అవకాశమన్న అధిష్టానం

పార్లమెంటు ఎన్నికల నియమావళి ముగియడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవుల జాతర మొదలు కానుంది. వేలాది మంది పోటీ పడుతున్నప్పటికీ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన, టికెట్లు రాని నాయకులకు మాత్రమే అవకాశం కల్పించాలని PCC నిర్ణయించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఇప్పట్లో ఎలాంటి పదవులు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు 37 మంది నామినేటెడ్‌ ఛైర్మన్లు ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తుండగా... మరికొంత మందికి పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి..


తెలంగాణలో హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు అవిశ్రాంతంగా పని చేశారు. సామాజిక సమీకరణలు, వివిధ అంశాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో కొందరికి టికెట్లు కేటాయించలేకపోయారు. ఆశించి భంగపడ్డవారికి ప్రభుత్వం రాగానే నియమిత పదవులిచ్చి సముచిత ప్రాధాన్యమిస్తామంటూ పార్టీ అధిష్ఠానం భరోసా ఇచ్చింది. నలుగురు సలహాదారులతో పాటు టీ శాట్‌ సీఈవో, ఆర్థిక కమిషన్‌ ఇలా కొన్ని నామినేటెడ్‌ పదవులతో పాటు మరో 37 నామినేటెడ్‌ ఛైర్మన్‌ పోస్టులను లోక్‌సభ ఎన్నికల ముందు సర్కార్‌ భర్తీ చేసింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడం వల్ల ఆలస్యమైన బాధ్యతల స్వీకరణ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. సామాజిక సమీకరణాల సమతుల్యతతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం, పార్టీకి విధేయులుగా ఉండి సేవలందిస్తున్న నాయకులకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా మిషన్‌, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌, వ్యవసాయ కమిషన్‌లతో పాటు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంపై ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ఆకునూరి మురళి, అల్తాఫ్ జానయ్య, కోదండ రెడ్డిలకు ఈ పదవులు దక్కే ఉందని ప్రచారం జరుగుతోంది. మూసీనది అభివృద్ది కార్పోరేషన్‌, RTC , పౌరసరఫరాల శాఖ కార్పోరేషన్‌లు ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 పోస్టుల భర్తీ ద్వారా ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న పార్టీ నాయకులకు న్యాయం చేయాలని భావిస్తోంది.

పార్టీ వాణి, భాణిని గట్టిగా వినిపిస్తున్న అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, భవాని రెడ్డి, చరణ్‌కౌసిక్‌ యాదవ్‌, కైలాస్‌ నేత, చారగొండ వెంకటేష్‌ సహా పార్టీకి పునరంకితమై పని చేస్తున్న నాయకులు నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. విద్యార్హతలు, వారు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఛైర్మన్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు మంత్రి పదవుల కోసం బోధన్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు, మంచిర్యాల MLA కొక్కిరాళ్ల ప్రేమసాగర్‌ రావు, మక్తల్‌ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్‌, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌లు పోటీపడుతున్నారు. భువనగిరి ఎంపీ స్థానం గెలిపించుకుంటే..కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా కొందరికి మంత్రి పదవులతో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదవుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ... ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి చర్చించాకే పార్టీకి మేలు చేసేలా భర్తీ ప్రక్రియ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story