NTR Daughter : ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తి..

NTR Daughter : ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో బాలకృష్ణ, రామకృష్ణ, చంద్రబాబు, లోకేష్.. దగ్గుబాటి, కంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అంత్యక్రియల్లో సోదరి పాడెను బాలకృష్ణ, రామకృష్ణ మోశారు. అంతిమ సంస్కారాలను ఉమామహేశ్వరి భర్త శ్రీనివాస్ పూర్తి చేశారు. ఉమమహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆఖరు చూపు కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అంతా తరలివచ్చారు. ఉదయమే ఉమామహేశ్వరి నివాసానికి చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. సోదరి అంత్యక్రియల్లో బాలకృష్ణ, రామకృష్ణ సమీప బంధువులు పాడె మోశారు. రెండ్రోజుల క్రితమే ఉమమహేశ్వరి తుదిశ్వాస విడిచినా.. అమెరికాలో ఉన్న కుమార్తె రాక కోసం ఆగారు. ఇవాళ అశృనయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
కంఠమనేని ఉమామహేశ్వరి మృతి నందమూరి ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది. ఇంకా ఆ బాధ నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. మొన్న చెల్లెలు మరణవార్త తెలియగానే బాలకృష్ణ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోస్టుమార్టం నుంచి మిగితా వ్యవహారాలన్నింటిని బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు.
అనారోగ్య కారణాలతో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అందరినీ షాక్‌కి గురి చేసింది. నందమూరి ఫ్యామిలీకి, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com