TG: తెలంగాణలో కలకలం రేపిన అత్యాచార ఘటనలు

TG: తెలంగాణలో కలకలం రేపిన అత్యాచార ఘటనలు
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం... సికింద్రాబాద్‌లో ప్రేమ పేరుతో ఘాతుకం

తెలంగాణలో ఒకేరోజు నమోదైన అత్యాచార కేసులో కలకలం రేపాయి. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్‌ సమీపంలో బస్సును ఆపి సీజ్‌ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్‌ కృష్ణ (ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ ఎన్‌.రాజేందర్‌ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

ప్రేమ పేరుతో

ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు నమ్మించిన స్వామి.. ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి అడగడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

మహిళ కాలులోకి బుల్లెట్‌


నగరశివారు నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంధంగూడలో ఓ మహిళ కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. పద్మ అనే మహిళ తన ఇంటి ఆవరణలో దుస్తులు ఉతికి ఆరేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బుల్లెట్‌ దూసుకొచ్చి కాలును గాయపరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలో ఇది రెండోసారి అని బాధితులు ఆరోపించారు.

Tags

Next Story