Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా..? 6 నెలల ముందే అభ్యర్థులు ఖరారు..

Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా..? 6 నెలల ముందే అభ్యర్థులు ఖరారు..
Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ , బీజేపిల స్పీడ్ చూస్తే ముందస్తు ఎన్నికల ఖాయమన్న చర్చ జరుగుతుంది.

Telangana: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ , బీజేపిల స్పీడ్ చూస్తే ముందస్తు ఎన్నికల ఖాయమన్న చర్చ జరుగుతుంది. ఇందుకు బలం చేకూరేలా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని తేల్చిచెప్పింది. నామినేషన్ల చివరి నిమిషం వరకు వేచిచూసే జాతీయ పార్టీలు సైతం ముందస్తు ప్రకటన లతో హోరెత్తిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి టీఆర్ఎస్ రాకుండా విపక్షాలు అన్ని ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే విపక్షాలకు అంతుచిక్కని నిర్ణయాలతో గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా కేసీఆర్.. ఇప్పుడు ఎలాంటి విధానంతో ముందుకు పోతారన్న చర్చ గులాబీ పార్టీ లో జరుగుతుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన రోజే 105 మంది జాబితాను విడుదల చేశారు సీఎం కేసీఆర్‌. వీటిల్లో మెజారిటీ సీట్లు సిట్టింగులకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎంత మందికి అవకాశం దక్కుతుందన్న చర్చ సాగుతోంది. 2014 , 2018లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు.

ఇక టీఆర్ఎస్ లో నాలుగైదు దఫాలుగా గెలిచిన సీనియర్లు కూడా ఉన్నారు. వీళ్లకు తోడు 2014, 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీంతో పాత, కొత్త నేతలతోపాటు ఈసారి వారసులు కూడా టికెట్ దక్కించుకునేందుకు పోటీలో ఉన్నారు. గతంలో ముందస్తు ఎన్నికలప్పుడే భారీగా అభ్యర్థుల ఎంపికలో మార్పులు జరుగుతాయని చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే కేసిఆర్ ఎన్నికలకు వెళ్లి మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదంటున్నారు గులాబీ శ్రేణులు.

చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వరుస వివాదాల్లో చిక్కుకొని పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. భూ వివాదాల తో పాటు క్రిమినల్ కేసులకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ కొంత మంది ఎమ్మెల్యేలకు ఉంది. దీంతో మూడోసారి అధికారంలోకి రావాలంటే అలాంటి చరిత్ర ఉన్న వారికి టికెట్లు దక్కే పరిస్థితి లేదు. వీటికి తోడు.. ప్రతి జిల్లాలో అంతర్గత విభేదాలతో పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. వర్గ పోరుతో పార్టీకి నష్టం చేకూర్చే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కదన్న ప్రచారం జరుగుతుంది.

గత ఎన్నికల్లో 86 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని తన బలాన్ని 103 కు పెంచుకుంది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారుతోంది. ఇతర పార్టీల నుంచి చేరినవారు ఎక్కువ మంది సీనియర్ లీడర్లు ఉండటంతో వారికి మళ్ళీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే గులాబీ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి చేతిలో ఓడినవారు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని ఆశపడుతున్నారు. ఇదే క్రమంలో లో పాత , కొత్త నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

జిల్లాల్లో ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునేందుకు వివాదాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై కేసిఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సారి ఎన్నికల వ్యూహకర్తప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన కేసీఆర్ అభ్యర్థులు ఎంపిక పైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈసారి 30 నుంచి 40 మంది వరకూ వివాదాస్పద ఎమ్మెల్యేలకు టికెట్ దక్కే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది. ఇలాంటి వారిపై ప్రత్యేక సర్వే కూడా కేసీఆర్ చేయించినట్టు టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి .

సిట్టింగ్ ఎమ్మెల్యేల రిమార్క్స్ అన్నీ చూసి టికెట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి . గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ఇప్పటి నుంచే అభ్యర్థుల జాబితా పై కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది . తన సొంత సర్వేలతో పాటు ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక జరగనున్నట్లు సమాచారం. మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈసారి గులాబీ బాస్ నిర్ణయాలు కఠినంగానే ఉండబోతున్నాయి . అది ముఖ్యంగా టిక్కెట్ల ప్రకటన పైన మరింత కఠినంగా ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు ,ఎంపీలు , ఎమ్మెల్సీలు అంతా ఇప్పటి నుంచే నియోజకవర్గాలను దాటి బయటికి రావడం లేదు. అయినా ఎంతమందికి ఈ సారి చెక్ పెడుతుందో అన్న టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నెలకొంది..

Tags

Read MoreRead Less
Next Story