OPPITION: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన కుంగడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఘటనపై సిట్టింగ్ జడ్జి సహా CVCతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న బీజేపీ.. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజిపై రాకపోకలు సాగించే వంతెన కుంగిపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ M.L.A శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడే బైఠాయించిన శ్రీధర్‌బాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం శ్రీధర్‌బాబును ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇచ్చారు.
మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, CLPనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్.. మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై క్షేత్రస్థాయి సందర్శనకు రావాలని మంత్రులు, హరీశ్‌రావు, K.T.R.కు సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభమైనప్పటీ నుంచి వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడిపోయిందని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పై ఉన్న బ్రిడ్జి కుంగిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీ న్యాయ విచారణకు ఆదేశించాలని కోదండరాం డిమాండ్ చేశారు. పిల్లర్ కుంగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరిగేవిధంగా ప్రభుత్వం శ్రద్ద కనబరుచలేదని తెలుస్తోందని, భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టును హడాఉడిగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మల్లన్న సాగర్‌లో 15 టిఎంసిలకు మించి నింపలేమని, ఎల్లంపల్లి వద్ద టన్నల్స్ లీక్ అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com