OU: పీహెచ్‌డీ కోర్సు ఫీజు పెంచడంపై విద్యార్థుల ఆందోళన

ఓయూ పీహెచ్‌డీ కోర్సు ఫీజు పెంచడంతో విద్యార్థులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓకే సారి ఇప్పుడున్న దానికంటే పదిరెట్లు ఎక్కువ పెంచడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసనలు చేస్తున్నారు. ఫీజును తగ్గించాలని డీన్‌కు వినతి పత్రాలు అందజేస్తున్నారు. 2వేలు ఉన్న ఫీజు 20వేలకు పెంచడంతో కట్టలేక పోతున్నామని తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఓయూలో చదువుకోవడానికి ఎంతో శ్రమించి సీట్లు సాధిస్తే ఫీజులు పెంచడం భారంగా మారిందని వెల్లడిస్తున్నారు.
అయితే వర్సీటీ వీసీ మాత్రం దశాబ్దకాలంగా ఫీజు పెంచటం లేదని అందుకే ఈ సారి పెంచాల్సి వచ్చిందన్నారు. మరో వైపు రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ ఫీజు పెంచడం వలన విద్యార్థులకు భారమేమి కాదన్నారు. అర్హతగల విద్యార్థులకు రీఎంబర్స్‌మెంట్ వస్తుందని తెలిపారు. స్కాలర్ షిప్ ద్వారా 30 వేలు వస్తాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ఫీజు పెంచినట్లు పేర్కొన్నారు.
ఆర్ట్స్, ఎడ్యూకేషన్, సోషల్ సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సుల్లో కేటగిరి-2లో సీటు సాధించిన విద్యార్థులు 20వేలు చెల్లించాలని ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఫార్మసీ కోర్సుల వారు 25వేలు చెల్లించాలని డీన్ మర్చ్ 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చ్ 21వ తేదీ వరకు చెల్లించాలని నిర్ణయించారు. అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు మార్చ్ 25 వరకు పొడిగించినట్లు ఓయూ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com