HYD: హోటల్ యజమాని దారుణ హత్య, కారణం ఏంటంటే

హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ యజమానిపై ఓయువకుడు దాడిచేసి కిరాతకంగా హతమార్చాడు. అందరూ చూస్తుడంగానే ఇనుపరాడ్డుతో దాడి చేసి చంపేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్ వినయ్ తో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ అనే హోటల్ నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూం కోసం ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
ఏడాది క్రితం స్టోర్ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆ సమయంలో ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్‌అనే వ్యక్తి శ్రీనివాస్‌తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతడిపైనే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. దీంతో తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. గురువారం సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్‌లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్‌పై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్, హోటల్ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకుని శ్రీనివాస్‌ను కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com