Telangana: రాష్ట్రంలో ఏరులైపారిన మద్యం..

రాష్ట్రంలో డిసెంబర్‌లో భారీమొత్తంలో మద్యం అమ్ముడుపోయింది. కొత్తమద్యం విధానం డిసెంబర్ నుంచే అమల్లోకి రావడం, నూతన సంవత్సరం కలిసి రావడంతో నెలరోజుల్లో ఏకంగా 4వేల 297 కోట్లు విలువైన విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల 28నుంచి 31వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టంచేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతంగా రాష్ట్రంలో డిసెంబర్‌లో.. మద్యం విక్రయాలు గణనీయంగా జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 డిసెంబర్‌లో 4వేల 297 కోట్లవిలువైన విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నుంచే నూతన మద్యం విధానం అమల్లోకి రావడం సహా ఏడాది చివరి నెలకావడం, కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో అమ్మకాలు పెరిగియి. కొత్త సంవత్సరానికి మూడు, నాలుగు రోజులు అధికంగా మద్యం అమ్ముడుపోవడం సర్వసాధారణం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణదారులు భారీ ఎత్తున మద్యం నిల్వచేశారు. అందుకు అనుగుణంగా డిసెంబర్‌లోని చివరి నాలుగురోజుల్లో 777 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే గతేడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో మాత్రమే అధికంగా అమ్ముడుపోయింది. ఆ రెండుజిల్లాల పరిధిలో 2022లో చివరి నాలుగు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా.. 2023 డిసెంబరులో అదే నాలుగు రోజుల్లో 242 కోట్లు విక్రయాలు జరిగాయి. వరంగల్‌లో 2022లో 64 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా 2023 డిసెంబర్ చివరన 70 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి మిగిలిన అన్ని జిల్లాల్లో 2022 డిసెంబర్ చివరి నాలుగురోజులతో పోల్చుకుంటే 2023లో తక్కువ అమ్ముడుపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి మూడ్రోజుల్లో 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్మడైనట్టు సమాచారం. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్‌గా ఉంచి.. తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించారు. డిసెంబర్ 30న రూ.313 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా.. గతేడాది రూ.250 కోట్లకుపైగా విలువైన మద్యం షాపులకు తరలివెళ్లింది. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2022లో అది రూ.775 కోట్లు ఉండగా.. 2023లో రూ.771 కోట్లకుపైగా మద్యం అమ్ముడైనట్టు విశ్వసనీయ సమాచారం. నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. వీటిల్లో ట్రైకమిషనరేట్ల పరిధిలోనే 3,254 కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com