Ramakrishna selfie video : బయటికొచ్చిన రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో

Ramakrishna selfie video : బయటికొచ్చిన రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో
Ramakrishna selfie video : రామకృష్ణకి సంబంధించిన మరో సెల్ఫీ వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో వనమా రాఘవ చేసిన అరాచకాలను ఏకరవు పెట్టారు రామకృష్ణ.

Ramakrishna selfie video : రామకృష్ణకి సంబంధించిన మరో సెల్ఫీ వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో వనమా రాఘవ చేసిన అరాచకాలను ఏకరవు పెట్టారు రామకృష్ణ. తన సోదరి, తల్లిని గుప్పిట్లో పెట్టుకుని.. వారసత్వంగా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి రానివ్వకుండా చేశారని ఆవేదనతో చెప్పుకున్నారు. ఏడాది కాలంగా వేధించి మరింత అప్పుల్లోకి నెట్టారని చెప్పారు. ఇక తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో దారి లేకుండా చేశాడని వనమా రాఘవ దురాగతాల గురించి చెప్పుకున్నారు. ఎక్కడో రాజమండ్రిలో ఉండే తన సోదరికి కొత్తగూడెంలో ఉండే వనమా రాఘవ ఎందుకు అంత ఫేవర్ చేశాడో ఈపాటికే మీకు అర్థమై ఉంటుందని సెల్ఫీ వీడియోలో వివరించారు.

ఇక వనమా రాఘవ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు రామకృష్ణ సోదరి మాధవి. తమ కష్టసుఖాలను వనమా రాఘవతో చెప్పుకునే వారమని తెలిపారు. అదే క్రమంలో తమ అప్పుల బాధను రాఘవకు చెప్పుకున్నామని, పంచాయితీ చేసిన మాటా వాస్తవమేనని అన్నారు. కానీ సెల్ఫీ వీడియోలో చెప్పినట్లుగా రాఘవ తన తమ్ముడి భార్యను పంపించమన్నాడన్న విషయం తనకు తెలియదని మాధవి చెబుతోంది. ఈ విషయం తమతో చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలపై తల్లి సూర్యావతి, సోదరి మాధవి వర్షన్ మరోలా కనిపిస్తోంది. రామకృష్ణకు అప్పులు ఉన్న మాట వాస్తవమేనని, అవి తీరేందుకు తాము సహకరిస్తామని కూడా చెప్పామంటున్నారు. హైదరాబాద్‌లోని ఇంటిస్థలాన్ని అమ్ముకోవడానికి అంగీకరించామని సోదరి మాధవి, తల్లి సూర్యవతి వివరించారు. అయినా భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడంలేదంటూ చెబుతున్నారు. కాని, నిజంగా తల్లి, సోదరి నుంచి సహకారం లభిస్తే రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే వాడే కాదని స్థానికులు చెబుతున్నారు.

వనమా రాఘవ వల్లే తన కూతురు, అల్లుడు, మనవరాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని రమాదేవి ఆరోపిస్తున్నారు. రాఘవ వేధింపుల కారణంగానే కుటుంబం బలైందని, అతణ్ని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ అత్త రమాదేవి డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు గాని అల్లుడు గాని ఏనాడూ వారి సమస్యలను తనకు చెప్పలేదని, చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. రామకృష్ణ బావమరిది జనార్దన్‌ కూడా రాఘవ అకృత్యాలపై ఆగ్రహంగా ఉన్నారు. ఒక సమస్యను పరిష్కరించమని అడిగినందుకు.. ఆ సమస్యనే ఆసరాగా తీసుకుని నీచాతి నీచంగా వ్యవహరించాడని, వనమా రాఘవను క్షమించకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story