Parliament Elections : ఎంపీ టికెట్ పై వి.వి.సి గ్రూప్ సంస్థల ఎండీ ఆసక్తి

Parliament Elections : ఎంపీ టికెట్ పై వి.వి.సి గ్రూప్ సంస్థల ఎండీ ఆసక్తి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోన్న పలు వర్గాలకు చెందిన వ్యక్తులు

మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ బరిలో పోటీకి దిగేందుకు వి.వి.సి గ్రూప్ సంస్థల ఎండీ రాజేంద్ర ప్రసాద్ ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆయన హైదరాబాద్ గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయిలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ కు మంచి పేరుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. ఖమ్మం నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాల ద్వారా రాజేంద్రప్రసాద్ సేవలందిస్తున్న ఆయన.. తన వ్యాపార సంస్థల ద్వారా దాదాపు 4వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ రోజు సాయంత్రం 5గంటలకు ముగియనుంది. దీనిపై ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసిన పార్టీ వర్గాలు.. మొదటి రోజున కేవలం 7అప్లికేషన్స్, 2వ రోజు 34, మూడో రోడు 140దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 181మంది టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. అందులో మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఇక అత్యంత తక్కువగా హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసిన వారిలో మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ఫ్రొపెసర్లు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఎన్నడూ లేనంతగా ఈ సారి గాంధీ భవన్ కు అప్లికేషన్లు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. ఇది పార్టీకి శుభ పరిణామమని, ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు విజయం పక్కా అంటూ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story