Munugodu: మునుగోడులో పార్టీల అభ్యర్థుల వేట.. ఆ ముగ్గురికే ఛాన్స్..

Munugodu: మునుగోడులో పార్టీల అభ్యర్థుల వేట.. ఆ ముగ్గురికే ఛాన్స్..
Munugodu: మునుగోడు ఉప ఎన్నిక మరో రెండుమూడు నెలల్లోనే జరిగే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి.

Munugodu: మునుగోడు ఉప ఎన్నిక మరో రెండుమూడు నెలల్లోనే జరిగే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి. ఫలానా వాళ్లు అని నిర్ణయించకముందే అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి కూడా రగిలింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వొద్దంటూ 12 మంది అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులకు లేఖ రాశారు.

మునుగోడు టీఆర్‌ఎస్‌ పంచాయితీ హైదరాబాద్‌కు చేరడంతో నాలుగు రోజులుగా అసమ్మతి నేతలతో మంత్రి జగదీష్‌ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే, స్థానిక నేతలు ఎంత వద్దంటున్నా.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. వ్యతిరేకత మరీ ఎక్కువైతే.. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని బరిలోకి దించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అటు కాంగ్రెస్‌లో కూడా అసమ్మతి చెలరేగింది. పాల్వాయి స్రవంతి మునుగోడు టికెట్‌ ఆశిస్తున్నట్టు ఓ ఆడియో లీక్‌లో బయటపడింది. కాని, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డిని బరిలో దించాలని చూస్తోంది. ఆర్థికంగానూ కృష్ణారెడ్డి బలవంతుడు కావడంతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోగలరని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే, రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు.

మండలాల వారీగా సమావేశాలు పెట్టి భరోసా ఇస్తున్నారని, ఆ సమావేశాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారనే సమాచారం కాంగ్రెస్‌ పెద్దలకు చేరింది. దీంతో రాజగోపాల్‌రెడ్డి వైపు వెళ్లాలనుకునే వారికి భరోసా కల్పించాలంటే.. చల్లమల్ల రామకృష్ణారెడ్డి ఒక్కరే కరెక్ట్‌ అని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, టికెట్‌ ఆశిస్తున్న వాళ్లు రెబల్స్‌గా మారకుండా పీసీసీ పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

సమన్వయ కమిటీలు, అభిప్రాయ సేకరణ పేరుతో ఆశావహులను పిలిపించి, ఏకాభిప్రాయం వచ్చేలా చేస్తోంది. ఆశావహులనే మండలాలకు పంపించి, ప్రచారం చేయించే ప్లాన్‌లో ఉంది.ఈసారి సీపీఐ, సీపీఎం ఎవరికి మద్దతిస్తాయనే ఉత్కంఠ నెలకొంది. అధికారపక్షం వైపు ఉంటుందా, లేదా కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. కాని, మునుగోడులో ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఉన్నందున.. ఎవరికీ మద్దతివ్వొద్దన్న ఆలోచనలో వామపక్షాలు ఉన్నాయి. ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story