Youth vote : యువతపైనే పార్టీల గురి
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీలన్నీకొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువ ఓటర్లపై దృష్టిసారిస్తున్నాయి. వారిని ఆకర్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. యువత మాత్రం తమ ఓటుహక్కును ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారు. తమ ఓటును సరైన రీతిలో ఉపయోగించుకుంటామని అంటున్నారు.
‘ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదవుదాం.. ఓటరు లిస్టు చెక్ చేసుకోండి.. మీ ఓటును సంరక్షించుకోండి.. మీ ఓటు మాయమైతే భవిత గల్లంతే.. మీ ఓటే మీ భవిష్యత్.. ఓటు ఒక వజ్రాయుధం.. నమోదు చేసుకొని చూడు తెలుస్తుంది నీ బలం..’ అంటూ బీఎల్‌వోలు రాష్ట్రంలో ఇంటింటా ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ప్రధానంగా పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సంకల్పించింది. విజయంతంగా ఆ పని చేసింది. దీనితో రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకం కానుంది. అయితే వీరి మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వారి పరిధిలో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. వారికి తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యువత మాత్రం తమ ఓటును వృథాగా పోనివ్వమని.. సమాజాభివృద్ధికి పాటు పడే నాయకుడిని ఎన్నుకుంటామంటున్నారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగబోమని తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారు. ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోబోమని రాష్ర్ట ప్రజలకు, విద్యార్థులు,నిరుద్యోగులకు మేలు చేసేవారికే ఓటు వేస్తామని లేదంటే నోటకు వేస్తామని యువత చెబుతున్నారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార ఖర్చులను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దేనికి ఎంత వ్యయం చేయాలో సూచించింది. అభ్యర్థులు గతంలో తమ ఖర్చులను తక్కువగా చూపించే వారు. ఈ సారి ఎన్నికల అధికారులే ధరల జాబితాను రెడీ చేశారు. దాని ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించనున్నారు. నీళ్ల ప్యాకెట్ నుంచి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే హోర్డింగ్స్, బెలూన్స్, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు. ఈసారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఈసీ పెంచింది. అభ్యర్థి ఖర్చుల వ్యయం గరిష్ఠంగా రూ.28 లక్షలు ఉండగా, దానిని ఈసారి రూ.40 లక్షలు చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com