వరద బాధిత కుటుంబాలకు పవన్‌ ప్రగాఢ సానుభూతి

వరద బాధిత కుటుంబాలకు పవన్‌ ప్రగాఢ సానుభూతి

వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగిందని.. కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఐదారు దశాబ్దాల్లో ఎన్నడూ ఇంత వర్షపాతం నమోదవలేదని చెప్పారు. పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే వరదల్లో ప్రాణ నష్టానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన సోషల్‌ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఆ పార్టీ విడుదల చేసింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పవన్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే ముంపునకు ముఖ్య కారణమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికైనా నాలాల మీద అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత... సంపన్నులు, ప్రజలది కాదని.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజలు ఒక వ్యవస్థను ఎన్నుకున్నారని... పన్నులు కట్టి ఆ వ్యవస్థ చేతిలో డబ్బు పెడుతున్నామని చెప్పారు. కొన్ని సార్లు అధికారంలో ఉన్న వారికి కూడా చేయూత అందించాలని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం ఇష్టానుసారం కాకుండా... చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెడితే బాగుంటుందని సూచించారు. విరాళాలు సరిపోవట్లేదు అని చెప్పేవారు.. తమ జేబులోంచి కనీసం 10 రూపాయలు అయినా ఇచ్చారా అని పవన్‌ ప్రశ్నించారు. సినీ రంగంలో వారికి కోటి రూపాయల సంపాదన ఉంటే... 10 కోట్ల రూపాయల ఉన్నంత ప్రాచుర్యం వస్తుందని అన్నారు.

ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల కోసం 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారని పవన్‌ అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో అదే డబ్బును పెట్టుబడి అనుకొని.. కనీసం 50కోట్లయినా ఖర్చు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అలాంటి వారితో పోల్చుకుంటే చిత్ర పరిశ్రమ చాలా చిన్నదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరడం వల్ల... ఇబ్బందయినా అందరూ విరాళాలు ఇస్తున్నారని పవన్‌ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అందర్నీ సంప్రదిస్తే బాగుంటుందని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story