PAWAN: పవన్ నీ సినిమాలు ఆపుతాం: మంత్రి కోమటిరెడ్డి

ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే సినిమాలు ఆపేస్తామని తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా పవన్ సినిమాలు థియేటర్లలో ఆడనివ్వం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయం అంటే రెండున్నర గంటల సినిమా కాదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బాధించాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు థియేటర్‌లో విడుదల కాకుండా ఆపేస్తామని హెచ్చరించారు. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్ర ప్రజల వల్ల తెలంగాణ వాళ్లు ఫ్లోరైడ్ తాగారని అన్నారు.
'పవన్ నీ పనితనం చూపించు'
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజోలులో పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని హితవు పలికారు. 'తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావు. మైలేజ్ పొందాలంటే పనితనం చూపించు. ఇలా కాదు' అని సూచించారు.
"తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలి"
తెలంగాణ ప్రజలవి దిష్టి కండ్లు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కు ఏపీ పై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్లిపోవాలని, అలా చేయకుండా కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీశారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా ? అని ప్రశ్నించారు. సామాన్యుడైన తాను పదేళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, 70 ఏళ్ల వయసులో ఆయన సీఎం అయి చేసేదేముందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి కండ్లు తలగడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

