BABU ARREST: బాబు వ్యతిరేక ఆందోళనల్లో బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు

BABU ARREST: బాబు వ్యతిరేక ఆందోళనల్లో బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు
తెలంగాణలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న నిరసన ప్రదర్శనలు.... చంద్రబాబు ఆరెస్ట్‌పై మండిపాటు

తెలంగాణలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా ఈ నిరసన ప్రదర్శనలకు మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీలకతీతంగా రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వనస్ధలిపురంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు అభిమానుల పేరిట నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో భారీగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

హైదరాబాద్ ASరావు నగర్ కాలనీ నుంచి E.C.I.L చౌరస్తా వరకు తెలుగు తమ్ముళ్లు మౌన పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగత నందమూరి హరికృష్ణ కుమర్తె సుహాసిని పాల్గొని చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో I.T అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిని అక్రమ కేసులో అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.


మియాపూర్ మదీనాగుడలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ కొవ్వత్తుల ప్రదర్శన చేపట్టారు. భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు, చిన్నారులు జై చంద్రబాబు అని నినాదాలుచేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని ఖమ్మంలో నిరసనలు పెల్లుబిక్కాయి. చంద్రబాబుకు అండగా ఖమ్మం వాసులు పోటెత్తారు. బాబు కోసం మేము సైతం అంటూ పార్టీలకు అతీతంగా కదం తొక్కారు. సుమారు 4 గంటలపాటు 4 కిలోమీటర్లకు పైగా సాగిన భారీ ర్యాలీలో మహిళలు, ఐటీ ఉద్యోగులు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జైబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో పాల్గొన్న NTR మనవడు చైతన్య కృష్ణ.. కేవలం రాజకీయ కక్షతోనే బాబును అరెస్ట్‌ చేశారని ధ్వజమెత్తారు. విజనరీ నేతను అరెస్టు చేయడం దారుణమని... వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా మంగపేటలోచంద్రబాబుకు మద్దతుగా తెదేపా అభిమానులు భారీ బైక్‌ ర్యాలీ చేశారు. రాజుపేట నుంచి కమలాపురం ఆంజనేయ స్వామి గుడి వరకు పార్టీలకు అతీతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయే రోజు దగ్గర పడిందని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గందంపల్లిలో తెదేపా శ్రేణులు నినదించారు. జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

Tags

Next Story