వాహనదారుల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు..!

పెట్రోల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్న తీరు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.. రోజూ ధరలు పెరుగుతుండటంతో బతుకు బండి నడిచేదెలాగో తెలియక గగ్గోలు పెడుతున్నారు.. గత కొద్దిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడమనే మాటే వినిపించడం లేదు.. నిత్యం 30 నుంచి 40 పైసలు పెరుగుతోంది.. పెట్రోల్ ధరలు ఇలాగే పెరిగితే వాహనాలు నడపలేమని ఆందోళన చెందుతున్నారు.
ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న పెట్రోల్ ధరలపై విజయనగరం జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నవంబరు పది నుంచి ఈరోజు వరకు ధరలు పెరుగుతూ పోతున్నాయే తప్ప ఒక్క పైసా కూడా తగ్గలేదు.. నవంబరు 11న విజయనగరం జిల్లాలో లీటరు పెట్రోల్ ధర 86 రూపాయల 41 పైసలు ఉండగా డీజిల్ ధర 78 రూపాయలా 59 పైసలు ఉంది.. నిత్యం పెరుగుతూ ఇప్పుడు లీటరు పెట్రోల్ 95 రూపాయలు దాటేసింది.. మరో వారం రోజుల్లో సెంచరీ కొట్టడం ఖాయంగా కనబడుతోంది.
ఇలా నిత్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళనలో పడిపోతున్నారు. చిరుద్యోగులు వీలైనంత వరకు ద్విచక్రవాహనాల వినియోగం తగ్గించుకోవాలని భావిస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మూడు ఏజెన్సీల ద్వారా రోజుకు రెండు లక్షల లీటర్లు పెట్రోల్, మూడు లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. అటు డీజిల్ ధరలు పెరుగుతుండటంతో లారీ యజమానులు సమ్మె బాట పట్టే యోచనలో ఉన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన సుంకాలను తగ్గించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.. గ్యాస్ సిలిండర్‌పై పాతిక రూపాయలు పెంచి పది రోజులు కూడా కాకముందే మరో 50 రూపాయలు పెంచేసింది కేంద్రం. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర 776 రూపాయలు దాటేసింది. పెట్రోల్, డీజిల్ తరహాలో గ్యాస్ ధరలు కూడా ప్రతి 15 రోజులకు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com