KCR: ట్యాపింగ్ కేసులో తర్వాతి నోటీసులు కేసీఆర్‌కేనా..?

తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కింది స్థాయి అధికారులు, మాజీ మంత్రుల విచారణలతో సాగిన ఈ కేసు, ఇప్పుడు నేరుగా గులాబీ పార్టీ అగ్రనేత వైపు మళ్లుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. విచారణలో కీలక ఘట్టంగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగియడం, తదుపరి అడుగు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉంటుందన్న ప్రచారం బలపడటం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఎన్నికల వ్యూహాలకోసం ఫోన్లు ట్యాప్ అయ్యాయా? విపక్ష నేతల వ్యక్తిగత సంభాషణలు రహస్యంగా రికార్డు అయ్యాయా? అధికార యంత్రాంగం రాజకీయ అవసరాలకు వినియోగించబడిందా? — ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఒక్క బిందువులో కలుస్తున్నాయి. ఆ బిందువే… తెలంగాణ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన పేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇటీవల హరీష్ రావును దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించింది. ఈ విచారణలో కీలక సమాచారం లభించిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో అరెస్టయిన అధికారుల వాంగ్మూలాలు, ఇప్పటికే రికార్డైన స్టేట్మెంట్లు, ఇప్పుడు హరీష్ రావు ఇచ్చిన వివరాలు – ఇవన్నీ సరిపోల్చిన తర్వాతే తదుపరి అడుగు ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తు దిశ ఇప్పుడు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వైపు మళ్లుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరోక్షంగా ప్రస్తావించారు. “తండ్రికి కూడా నోటీసులు ఇవ్వవచ్చు” అన్న సంకేత వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చకు దారితీశాయి.
మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేతను విచారించాలంటే కేవలం చట్టపరమైన పరిజ్ఞానం సరిపోదు… రాజకీయ, పరిపాలనా ఒత్తిడులను తట్టుకునే ధైర్యం కూడా అవసరం. ఇదే కారణంతో ప్రభుత్వం ఈ కేసు బాధ్యతను ఐపీఎస్ అధికారి సజ్జనార్‌కు అప్పగించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ విచారణ వేగం, సేకరిస్తున్న ఆధారాల తీరు చూస్తుంటే ఈ కేసును తేల్చాలన్న పట్టుదల ప్రభుత్వానికి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ ఆరోపణలపై కాకుండా, సాంకేతిక ఆధారాలను బలంగా నిలబెట్టే దిశగా దర్యాప్తు సాగుతోందని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశంలో మాటల కంటే ఆధారాలే కీలకం. ఈ కేసులోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం.
సజ్జనార్ దర్యాప్తు వేగం చూస్తుంటే, వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. కేసీఆర్‌కు నోటీసులు జారీ అయితే, అది కేవలం ఒక విచారణ మాత్రమే కాదు… తెలంగాణ రాజకీయాల దిశను మార్చే ఘట్టంగా మారే అవకాశం ఉంది. ఒకవైపు చట్టం తన పని తాను చేస్తుందా? మరోవైపు రాజకీయ పోరు మరింత ఉధృతమవుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు కేవలం ఒక కేసు కాదు. అది తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే కేంద్ర బిందువుగా మారుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
