Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సంచలనం విషయాలు రాధాకిషన్ రావు వాగ్మూలం రూపంలో బయట పడ్డాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇందుకు అనుసరించిన వ్యూహమేంటి? దీన్ని ఎలా అమలు చేశారు? వంటి వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి KCR సహా మాజీ మంత్రి హరీష్ రావు పేర్లూ బహిర్గతమయ్యాయి.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రాధాకిషన్ రావు పోలీసులకు తెలిపిన వాగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. పోలీసులకు రాధాకిషన్ రావు ఈ విషయాలను వెల్లడించారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందన్న రాధాకిషన్ భారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని KCR కోరుకున్నారని వెల్లడించారు. ఆయన అభీష్టం, ప్రభాకర్‌రావు సూచన మేరకు తనను టాస్క్‌ఫోర్స్ DCPగా నియమించారని తెలిపారు. KCR ఆలోచనలను అర్ధం చేసుకొని అప్పటి నుంచి ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టానని వివరించారు. సివిల్ వివాదాల పరిష్కారంతోపాటు ముఖ్యమంత్రి, భారాసకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకొనిరావడం, ఆదోళనలను అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవని తెలిపారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా KCR చిరాకు పడేవారనీ... ప్రతిపక్ష నాయకులను గమనిస్తూ ఉండేందుకు SIB DSP ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో IG ప్రభాకర్‌రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని వెల్లడించారు. అప్పటి నుంచి వారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టానని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.
వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్‌రావు ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, తెరాస పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల ముందు మొదలైన ఈ పని 2019 లోక్‌సభ, ఆ తర్వాత ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, భారాసకు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నాయకులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్‌రావు తరచుగా చర్చించేవారని తెలిపారు. వీటి ఆధారంగా ప్రణీత్‌రావు ఆయా నాయకులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు. అనేక మంది సొంత పార్టీ నాయకులనూ పర్యవేక్షించినట్లు వివరించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదిస్తున్న శంభీపూర్ రాజు, కడియం శ్రీహరితో రాజకీయ వైరం ఉన్న రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఆయన భార్యతోపాటు R.S ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, NTV, ABN TV ఛానళ్ల అధినేతలు నరేంద్రనాథ్ చౌదరి, రాధాకృష్ణలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com