PHONE TAPPING: ట్యాప్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాజకీయ యవనికపై కనీవినీ ఎరుగని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని శాసించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ సెగ తగిలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) బుధవారం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. నేడు (శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. లేదా విచారణ కేసీఆర్ కు ఎక్కడ అనుకూలమో చెప్పాలని అక్కడికే అధికారులు వస్తారని తెలిపారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు గంటల తరబడి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వీరి ముగ్గురి నుంచి సేకరించిన సమాచారం, ఇప్పటికే అరెస్టయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాల్లోని కీలక అంశాలను బేరీజు వేసిన సిట్.. విచారణను నేరుగా 'ముఖ్యమంత్రి కార్యాలయం' (CMO) వైపు మళ్లించింది.
కీలక అంశాలపైనే గురి!
ఈ విచారణలో ప్రధానంగా మూడు అంశాలపై సిట్ దృష్టి సారించనుంది. ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరు? ఎన్నికల సమయంలో ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో నగదు ప్రవాహాన్ని ఎలా నియంత్రించారు? నిఘా పరికరాలను ప్రైవేట్ అవసరాలకు, రాజకీయ లబ్ధికి ఎలా వాడారు? అన్న దానిపైనే కీలకంగా విచారణ జరగనుంది. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కోవడం ఇదే ప్రథమం. ఇది కేవలం ఒక పోలీస్ కేసు మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఉనికికి సంబంధించిన రాజకీయ పరీక్ష కూడా. అరెస్టయిన అధికారులు "అన్నీ పైవారి ఆదేశాల మేరకే జరిగాయి" అని చెప్పడం ఇప్పుడు కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసింది. కేసీఆర్ స్వయంగా హాజరవుతారా? లేక న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి మినహాయింపు కోరుతారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే, ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
