MODI: నెరవేరిన రైతుల దశాబ్దాల కల

తెలంగాణ రైతుల దశాబ్దాల కల నెరవేరింది. ఏళ్లుగా రైతులు ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది. ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం అన్నదాతల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. గత ఎన్నికల ముందు పసుపు బోర్డు కోసం రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నామినేషన్లు సైతం వేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు బాండ్ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచాడు . ఏపీలో పసుపు పంట పేరు చెబితే నిజామాబాద్ జిల్లానే గుర్తొస్తుంది . దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏటా నిజామాబాద్ మార్కెట్‌కు ఆరు లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు పంట రైతులు తెస్తుంటారు. నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పసుపు పంట సాగవుతున్నా... నిజామాబాద్‌లోనే అత్యధికంగా 35వేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నారు.
ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది . దశాబ్దాలుగా చేసిన పోరాటాన్ని ప్రధాని గుర్తించడం వల్లే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మోదీకి అన్నదాతలు ధన్యవాదాలు చెబుతున్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటించడంపై బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు వేదికగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని, ప్రజల్లో తమ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని ప్రకటించారు. ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తామనన్న ప్రధాని... గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
పాలమూరు గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని సమరభేరీ మోగించారు. తొమ్మిదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్, భాజపా మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా భారాసనే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. అవినీతే కాంగ్రెస్, భారాస సిద్ధాంతం అంటూ విమర్శలు చేశారు. రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుతున్నాయన్న మోదీ భారాస సర్కార్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. భాజపాకు తెలంగాణ మద్దతు, విశ్వాసం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. మోదీ హామీ ఇస్తే నెరవేర్చుతారని అందుకే భాజాపాను గెలిపించి..తెలంగాణను కొత్త ప్రగతి దారిలో నడిపించాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com