MODI: నేడు బీసీ ఆత్మ గౌరవ సభ

MODI: నేడు బీసీ ఆత్మ గౌరవ సభ
ఎల్బీ స్టేడియంలో సభకు హాజరుకానున్న ప్రధాని మోదీ.... కీలక హామీలు ఇచ్చే అవకాశం

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీసీ ఆత్మ గౌరవ సభ పేరిట ఎల్బీస్టేడియం వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సభను నిర్వహిస్తోంది. బీసీ ముఖ్యమంత్రి హామీని క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీని సభకు ఆహ్వానించారు. తెలంగాణ నాయకత్వం ఆహ్వానం మేరకు బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కాషాయరంగు పులుముకున్నాయి. ఆ సభకు సుమారు లక్ష మందిని తరలించేందుకు భాజపా తెలంగాణ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. బీసీ ఆత్మ గౌరవ సభ వేదికగా ప్రధాని పలు కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీస్టేడియానికి బయల్ధేరి వెళ్తారు. ఐదున్నర నుంచి 6 గంట 10 నిమిషాల వరకు బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభా వేదికగా పలు కీలక హామీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి 6 గంటల 35 నిమిషాలకు ఢిల్లీకి తిరిగివెళ్తారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, తరుణ్‌చుగ్ పరిశీలించారు. సభావేదిక, ప్రవేశ ద్వారాలు, గ్యాలరీలను నేతలు పరిశీలించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేసి తీరుతామన్న లక్ష్మణ్.. ప్రధాని హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. బీసీలంతా ఒక్కటవుతున్నారని భారాస కుర్చీలు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగ సభకు పోలీసులు భారీభద్రత ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే నాయకులు, అభిమానులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించారు. ఇద్దరు జాయింట్ సిపిలు, ముగ్గురు IPS అధికారులు సహా 25 మంది DSP, 65 మంది CIలు, 114 మంది Siలతోపాటు ఇతర సిబ్బంది. 2 క్విక్‌రెస్పాన్స్ టీమ్స్, 18 ప్లటూన్ల అదనపు బలగాలు విధుల్లో ఉండనున్నాయి. వారితో పాటు మరో 300 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకూ ఎల్బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్నారు. మోదీ పర్యటన దృష్ట్యా NTRగార్డెన్, లుంబినీపార్కుని మూసివేస్తున్నట్లు HMDA తెలిపింది. భద్రతాఏర్పాట్లలో భాగంగా మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story