MODI: తిన్నదంతా తిరిగి వసూలు చేస్తాం

MODI: తిన్నదంతా తిరిగి వసూలు చేస్తాం
బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రధాని మోఢీ హెచ్చరిక... కేసీఆర్‌ బీసీలను మోసం చేశారని విమర్శ

బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్రమోఢీ విమర్శించారు. అవినీతి చేసిన వారిని విడచిపెట్టబోమన్న ఆయన తిన్నదంతా తిరిగి వసూలు చేస్తామని అది మోఢీ గ్యారెంటీ అని హెచ్చరించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. ప్రజలు, బీసీలను మోసంచేసిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓపెన్‌టాప్‌జీప్‌లో ప్రజల మధ్య నుంచి వెళ్లిన మోఢీపై పార్టీ శ్రేణులు పుష్పవర్షం కురిపించారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వదాంతో ప్రసంగం మొదలుపెడుతున్నట్లు చెప్పిన మోదీ పదేళ్ల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియానికి వచ్చానని ఎల్బీస్టేడియంలో జరిగిన సభ దేశ చరిత్రలో మార్పునకు నాందిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ సభ తర్వాతే భారత ప్రధాని అయ్యానని గుర్తుచేశారు. ప్రస్తుతం బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎల్బీస్టేడియం కీలకంగా మారాలని కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిందన్న మోదీ తిన్న అవినీతిసొమ్ము అంతా తిరిగివసూలు చేస్తామని స్పష్టం చేశారు


కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. వారికి ప్రజాసంక్షేమం కంటే స్వలాభమే ముఖ్యమని ప్రధాని మోదీ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రెండో టీమ్‌ ఏదో తెలిసిపోయిందన్న మోఢీ తెరవెనుక సీ టీమ్‌ కూడా ఉందన్నారు. కాంగ్రెస్ బీఅర్‌ఎస్‌కి... సీ టీమ్‌ అని.. కాంగ్రెస్‌, బీఆర్‌ రెండు పార్టీల డీఎన్‌ఏలో మూడు అంశాలు ఉమ్మడిగా కనిపిస్తాయన్నారు. మొదటిది కుటుంబ పాలన, రెండోది అవినీతి, మూడోది బుజ్జగింపు రాజకీయాలు అని మోఢీవిమర్శించారు. కుటుంబ పాలన మనస్తత్వంతో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఎప్పుడూ బీసీని సీఎంను చేయలేదన్నారు.


నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని మోదీ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బీసీలు ఎంతో కష్టపడ్డారని తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. OBC, SC, ఎస్టీల సంక్షేమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు పట్టించుకోలేదని మోఢీ విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు అహంకారం తలకెక్కిందని ధ్వజమెత్తారు.

నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని ఐతే అవన్నీ నినాదాలుగానే మిగిలిపోయాయ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దేశం సంక్షేమం కోసం మోఢీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. అందుకే తనకు మోడీ అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అమిత్‌షా ప్రకటిస్తే కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం కాదు గుణం ముఖ్యమని కేటీఆర్ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, భారాస, మజ్లిస్ మూడు ఒక్కటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story