MODI: ఎస్సీ వర్గీకరణకు కమిటీ..

MODI: ఎస్సీ వర్గీకరణకు కమిటీ..
X
సమస్యను త్వరగా పరిష్కరిస్తామన్న ప్రధాని మోడీ.. ఏడ్చేసిన మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే కమిటీ వేస్తామని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న మోడీ MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో జరుగుతున్న పోరాటానికి పూర్తి బాసటగా ఉంటామని చెప్పారు. హక్కుల సాధన కోసం చేస్తున్న న్యాయ పోరాటంలో అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మూడు దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పెరేడ్‌ మైదానంలోని సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతం పలికారు. సభా వేదికపై మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ ఒకదశలో భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. మూడు దశాబ్దాల నుంచి తాము వర్గీకరణ కోసం పోరాడుతున్నట్టు ప్రధానికి వివరిస్తూ కంట నీరు పెట్టుకున్నారు. ఈ దశలో ప్రధాని మోడీ మందకృష్ణ వెన్నుతట్టి ఓదార్చారు. తన చిన్న తమ్ముడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా వన్‌ లైఫ్‌-వన్‌ మిషన్‌ లక్ష్యంతో పని చేస్తున్నారని మోడీ కొనియాడారు. మందకృష్ణ పోరాటంలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు.


కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని గుర్తుచేసిన మోడీ పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం కూడా పెట్టలేదని విమర్శించారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాతే అంబేడ్కర్‌ ఫోటో పెట్టామని, భారతరత్న ఇచ్చినట్టు గుర్తుచేశారు.

మాదిగలకు అన్యాయం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పిన మోడీ మందకృష్ణఆశయాలకు అనుగుణంగా మాదిగలతో కలిసి పనిచేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్న మోడీ ఈ అంశంపై త్వరలోనే కమిటీ వేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోందన్న మోడీ దళితనేతను సీఎంను చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని, దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని వివరించారు. దళితబంధు పథకం వల్ల భారాస నేతలకే మేలు జరిగిందన్న మోడీ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఓ యువతి ఫ్లడ్‌లైట్ స్తంభం పైకి ఎక్కారు. ఇది చూసిన మోదీ కిందకు దిగాలని విజ్ఞప్తి చేయగా ఆమె కిందకు దిగారు.

Tags

Next Story