PM Modi: ప్రధాని మోదీ అదిరిపోయే స్పీచ్..కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

PM Modi: ప్రధాని మోదీ అదిరిపోయే స్పీచ్..కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన సంపదపై పన్ను వేస్తారంటూ ఆగ్రహం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ...కాంగ్రెస్‌, భారాసపై నిప్పులు చెరిగారు. భారాస ఓటుకు నోటు కేసును తొక్కిపెడితే... ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం కుంభకోణాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించిన మోదీ...దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందన్నారు.

రాజ్యాంగం, అంబేడ్కర్‌పై కాంగ్రెస్‌కు గౌరవం లేదన్న మోదీ.. తనకు రాజ్యాంగంపై అపార గౌరవం ఉందన్నారు. ఓటమి తప్పదనే నైరాశ్యంలో కాంగ్రెస్‌ నేతలు దిగజారుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు... ఫేక్‌ వీడియో సృష్టించారన్న ఆయన.. ఆ వీడియోలను విడుదల చేసేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని ప్రధాని మోదీ వెల్లడించారు. నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, రైలు మార్గాలు, జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేశామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడంలేదని మోదీ ఆరోపించారు. మాదిగలకు అండగా ఉంటామన్న ప్రధాని మోదీ... ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు." పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్‌ వసూలు చేస్తామంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55శాతం ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారాస దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలోఉన్న కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారాసను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటే." అని ఆరోపించారు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ త‌రుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి నేతలు తెలంగాణలో వాలిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. తాజాగా మోదీ విచ్చేశారు. జ‌హీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెద‌క్ అభ్యర్థి ర‌ఘునంద‌న్‌రావుకు మ‌ద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని అదిరిపోయే ప్రసంగం చేశారు.

Tags

Next Story