PM Modi : ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఫిక్స్
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో గెలుపుపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ దిశగా కృషి చేస్తోంది. ఢిల్లీ నుంచి అగ్రనేతలు సైతం వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. దీంట్లో భాగంగా మరోసారి తెలంగాణకు రానున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మూడు రోజుల్లో ఆరు సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలో హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
నవంబర్ 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ప్రధాని మోడీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా, బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బుధవారం బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సిటీలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను జనసైనికులు పూర్తి చేశారు. అనంతరం వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తరఫున కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com