Pochampalle: ఖండాంతరాలు దాటిన భూదాన్ పోచంపల్లి ఖ్యాతి.. ఆ రెండింటినీ వెనక్కి నెట్టి..

Pochampalle (tv5news.in)

Pochampalle (tv5news.in)

Pochampalle: అందమైన కోనసీమను తలపించేలా కొబ్బరిచెట్లు.. చెరువులు నిండిన పచ్చని ప్రకృతి సోయగాలు భూదాన్‌ పోచంపల్లి సొంతం.

Pochampalle: అందమైన కోనసీమను తలపించేలా కొబ్బరిచెట్లు.. చెరువులు, సెలయేళ్ల సవ్వళ్లతో నిండిన పచ్చని ప్రకృతి సోయగాలు భూదాన్‌ పోచంపల్లి సొంతం. ఉద్యమాల చరిత్ర, ప్రాచీన కళా, చారిత్రక నేపథ్యంతోపాటు.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలిసిల్లుతూ.. భారతదేశం నుంచి బరిలో నిలిచిన మూడు ప్రముఖ గ్రామాల్లో ఒకటిగా నామినేషన్ దక్కించుకొంది. తాజాగా మిగతా రెండు గ్రామాలను వెనక్కి నెట్టి.. ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ-UNWTO గుర్తింపు దక్కించుకొన్న పోచంపల్లి.. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉంటుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే భూదాన్‌ పోచంపల్లిలో భూమికి ఆకుపచ్చని రంగేసినట్లుగా.. ఎటుచూసినా కనుచూపు మెరలో పచ్చదనం, ఎత్తైన కొబ్బరి చెట్లు.. గలగలపారే సెలయేర్లు, చెరువూ-కుంటలతో కలగలిపిన ప్రాంతంగా విలసిల్లుతోంది.

ఎన్నో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ లకు సైతం కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలాగే ఎన్నో చారిత్రక సంఘటనలకూ ఈ గ్రామం కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్దతిలో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంలో భాగంగా.. UNWTO సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ నిర్వహించింది.

ఈ పోటీలో భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సాధించగా అందులో తెలంగాణకు చెందిన భూదాన్‌ పోచంపల్లి ఒకటి. మిగతా రెండింటిని వెనక్కి నెట్టి ప్రపంచ పర్యాటక గ్రామంగా తాజాగా భూదాన్‌ పోచంపల్లి ఎంపికైంది. డిసెంబరు 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో UNWTO సంస్థ ఈ అవార్డును ప్రదానం చేయనుంది. ఓ వైపు పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యం.. పట్టణ వాతావరణం కలగలిపి.. మగ్గాల చప్పుళ్లు, ప్రపంచంలోనే ఒకటిగా పేరున్న చేనేత పట్టు, ఇక్కత్, టై అండ్ డై వస్త్రాల తయారీలో పేరున్న ప్రాంతం కావడంతో.. వరల్డ్ బెస్ట్ టూరిజమ్ విలేజ్ గా ఎంపిక కావడానికి కావల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పొచ్చు.

హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని భూదాన్‌ పోచంపల్లి గ్రామ ప్రజల ప్రధాన వృత్తి చేనేత. టై అండ్‌ డై విధానంలో రంగురంగుల డిజైన్‌లతో చీరలను.. వస్త్రాలను తయారు చేయడంలో దిట్టలైన ఇక్కడి చేనేత కళాకారుల పనితనం ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇక్కత్‌ శైలిలో నేసే చీరలకు 2004లో జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌-జీ.ఐ. గుర్తింపు దక్కింది.

తాజా.. గుర్తింపుతో పోచంపల్లి ప్రత్యేకత ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కృతమైంది. దీంతో.. భూదాన్‌ పోచంపల్లి పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించనున్నాయి. ఫలితంగా విదేశీయుల రాకపోకలు పెరిగి పోచంపల్లి ఖండాంతర ఖ్యాతి గడించనుంది. నిజాంల కాలంలోనే అరబ్ దేశాలకు తేలీయా రూమాలు ఎగుమతిచేసిన గ్రామం.. అప్పట్లో పోచంపల్లిలో గాజులు, పూసల తయారీ జరిగేది.

మూసీ పరివాహకం కావడంతో వ్యవసాయానికి నిలయమైంది. చేనేత, చేతి వృత్తులతోపాటు కుటీర పరిశ్రమలకూ కేంద్రంగా భాసిల్లుతోంది. పోచంపల్లి గ్రామానికి.. భూదానోద్యమానికి అంకురార్పణ చేసి చరిత్ర సృష్టించిన చారిత్రక నేపథ్యం ఉంది. 1951 ఏప్రిల్‌ 18న మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లిలో పర్యటించనప్పుడు.. ఆయన పిలుపు మేరకు వెదిరె రామచంద్రారెడ్డి ఏకంగా 100 ఎకరాల భూమిని దళితులకు దానం చేశారు.

అలాగే.. చేనేత పట్టు వస్త్రాలకు, చేనేత కళాకారుల కళానైపుణ్యానికి చిరునామాగా నిలిచి సిల్క్‌సిటీ ఆఫ్‌ ఇండియా గా గుర్తింపు పొందింది. రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, చైనా.. ఇలా 100 దేశాలకు పైగా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికవడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భూదాన్‌ పోచంపల్లికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రామప్ప ఆలయానికి, పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, త్వరలోనే బుద్ధవనం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రదేశాలకు ప్రపంచ గుర్తింపు కోసం కృషి చేస్తామని వెల్లడించారు. పోచంపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

ఇప్పటికే.. భూదాన ఉద్యమం అకురార్పణ చేసిన ప్రాంతంగా.. నిజాంల కాలంలోనే అరబ్ దేశాలకు తేలీయా రూమాలు ఎగుమతిచేసిన గ్రామంగా.. ఆతర్వాత ఇక్కత్ చేనేత శైలితో వస్త్రాలుతయారీతో అంతర్జాతీయ గుర్తింపు పొందింన భాదాన్ పోచంపల్లి.. అంతర్జాతీయ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడంతో.. ఈ ప్రాంత ఖ్యాతి మరోమారు ఖండాంతరాలు దాటిందనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story