TS Police: న్యూ ఇయర్ నేపధ్యంలో నిఘా నీడలో భాగ్యనగరం

ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నా.. మాదక ద్రవ్యాల సరఫరాదారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం సృష్టిస్తోంది. నూతన సంవత్సర వేడుకల కోసం.. దుండగులు అక్రమ మార్గాలలో నగరానికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత హడలెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నా.. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారుల్లో మార్పు వస్తున్న దాఖలాలు కానరావడం లేదు. కొందరు యువకులు గోవా నుంచి తెప్పించిన ఖరీదైన డ్రగ్స్‌తో మునిగితేలుతుండగా TSన్యాబ్, SRనగర్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్‌లో పుట్టినరోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వినియోగిస్తున్నట్టు తెలియటంతో ప్రధాన నిందితుడు ఆశిక్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు రాజేష్ సహా 12 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ వేటలో హైదరాబాద్ వచ్చిన నెల్లూరుకి చెందిన ఆశిక్ యాదవ్.. అతని స్నేహితులు రాజేష్, సాయిచరణ్ తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. దీంతో అక్కడ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని బాబా అనే వ్యక్తి వద్ద.. ఎక్స్‌టాసీ బిళ్లలు కొనుగోలు చేసి నగరంలో అధికధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. డబ్బుకోసం ఉద్యోగాలు మానేసి మరీ.. ముగ్గురూ డ్రగ్స్ దందాలో దిగారు.
ఈనెల 12న ఆశిక్‌యాదవ్, రాజేశ్‌యాదవ్, సాయిచరణ్ గోవాలో 60 ఎక్స్‌టాసీ పిల్స్ కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 20 చొప్పున పంచుకున్నారు. 18 పిల్స్ విక్రయించిన ఆశిక్ మిగిలిన రెండు పిల్స్ విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. రెండ్రోజుల క్రితం అమీర్‌పేట్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న యువకుల కోసం డ్రగ్స్ చేరవేసినట్టు సమాచారం అందటంతో.. TS న్యాబ్ బృందం, SRనగర్ పోలీసులతో కలిసి తనిఖీ చేసి ఆశిక్‌యాదవ్‌ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో సరఫరాదారుడు రాజేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. తరచూ వీరిని సంప్రదిస్తూ ఉండే 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నిందితుడు రాజేశ్ నుంచి లక్షా 80వేల రూపాయలు విలువ చేసే 40 ఎక్స్‌టాసీ పిల్స్, 4 చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల్లో మరికొంత మంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెల్లూరు అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ స్టిక్కర్‌తో పోలీస్ స్టేషన్‌కు ఓ బెంజ్ కారు రావటం, డ్రగ్స్ సరఫరా దారులు, వినియోగదారులు ఎక్కువ శాతం నెల్లూరుకు చెందిన వారే కావటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార వైకాపా నాయకుడి కుమారుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టు... సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com