Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో కీలక వీడియోలు విడుదల.. యువకుడి అరెస్ట్..

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మొదట విధ్వంసం చేసిన నిందితుల వీడియోలు బయటపడ్డాయి. ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ అనే యువకుడే అల్లర్లకు ప్రోత్సాహించినట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముందుగా ప్యాసింజర్ బోగిలోకి వెళ్లి సీట్లకు నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్, పోస్టుల ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఆస్తులను కూడా ధ్వంసం చేశాడు.
మొత్తానికి విధ్వంసం సృష్టిస్తూ.. ఆకతాయిగా తీసుకున్న వీడియోలే పృథ్వీరాజ్‌ను పట్టించాయి. రైలు ప్యాసింజర్ బోగీలో సీట్లకు నిప్పుపెడుతూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకున్నాడు. ఆ విజివల్స్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి, యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన అభ్యర్థులను.. పృథ్వీరాజే విధ్వంసానికి ప్రేరేపించినట్లు నిర్ధారించారు. రైల్వే ఆస్తులను, బోగీలను కూడా నాశనం చేశాడు. ఈ కేసులో పృథ్వీరాజ్‌తో పాటు ఇవాళ 10 మందిని అరెస్ట్ చేశారు.
ఇక అల్లర్లకు ప్రధాన సూత్రధారి సుబ్బారావే అని తేల్చారు సెంట్రల్ ఇంటలిజెన్స్, ఐటీ అధికారులు. విద్యార్థుల్ని రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. సెంట్రల్ ఇంటలిజెన్స్ విచారణలో కీలక విషయాలు బయటికొచ్చాయి. దేశవ్యాప్తంగా 9 బ్రాంచ్‌లు నడుపుతున్న సుబ్బారావు... ఆర్మీ కోచింగ్ పేరుతో 2 లక్షల ఫీజ్ వసూల్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే అగ్నిపథ్ స్కీం ప్రకటించిన కేంద్రం.. రాత పరీక్ష లేదని అనడంతో సుబ్బారావు 50 కోట్లు నష్టపోయాడు. ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి.. రాతపరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్లాన్ వేసినట్లు గుర్తించారు.
పక్కా ప్లాన్ ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంకు కార్యాచరణ రచించాడు సుబ్బారావు. వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ 800 మంది అభ్యర్థులను రెచ్చగొట్టాడు. విధ్వంసంలో పాల్గొన్న సాయి అకాడమీ అభ్యర్థులకు భోజన, వసతి ఏర్పాటు చేశాడు. మూడు రోజుల పాటు సుబ్బారావును విచారించిన సెంట్రల్ ఇంటలిజెన్స్, ఐటీ అధికారులు ఈ కీలక విషయాలు బయటపెట్టారు. విచారణ ముగియడంతో అతన్ని తెలంగాణ పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com