Yadadri Bhuvanagiri: పోలీసుల నిర్లక్ష్యంతో 3 నెలల బాబు మృతి..? చలాన్ పేరుతో..

Yadadri Bhuvanagiri: యాదాద్రి జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా 3 నెలల బాబు మృతి చెందాడనే వార్తలు కలకలం రేపాయి. అత్యవసరంగా వైద్యం కోసం వెళ్తున్న వారిని ఆపి.. చలానా పేరుతో అరగంటపాటు రోడ్డుపైనే ఆపేసారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆ కారణంగానే సకాలంలో వైద్యం అందక బాబు చనిపోయాడని బాధిత కుటుంబం చెప్తోంది. జనగామకు చెందిన దంపతులకు 3 నెలల కిందట బాబు పుట్టాడు.
ఐతే.. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అద్దెకారు తీసుకుని వస్తుండగా యాదాద్రి పోలీసులు మధ్యలో ఆపేసారని వారు అంటున్నారు. ఆ కారుపై వెయ్యి రూపాయలు చలాన్ ఉందని, ఆ పెండింగ్ చలాన్ క్లియర్ చేయాలని గట్టిగా పట్టుబట్టారని అంటున్నారు. ఈ కారణంగా తాము ఆస్పత్రికి చేరే సరికి ఆలస్యమైందని కన్నీరు పెడుతున్నారు.
బిడ్డ ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పోలీసులు వినలేదని ఆరోపిస్తున్నారు. కొంచెం ముందు తీసుకువస్తే బాబును కాపాడేవాళ్లమని వైద్యులు చెప్తున్నారని అంటున్నారు. మూడు నెలల బాలుడు చనిపోయిన విషయంపై యాదాద్రి ట్రాఫిక్ సీఐ స్పందించారు. తాము వాహనాల్ని ఆపి ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితి వస్తే తామే సాయం చేసేవాళ్లమమని, చలాన్ల పేరుతో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com