Jayashankar Bhupalpally : భూపాలపల్లిలో పోలీసుల కూంబింగ్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలు విడుదల

Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో.. అలర్ట్ అయిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ సైతం మారుమూల ప్రాంతాలతోపాటు అటవీ గ్రామాలను జల్లేడ పడుతూ.. గోదావరి నదీ తీరం, తెలంగాణ-మహారాష్ట్ర- చత్తీస్‌గఢ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
మహముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో కొద్ది రోజులుగా మావోయిస్టుల లేఖలు కలకలం రేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మోస్ట్ వాంటెడ్ అయిన 15 మంది మావోయిస్టుల ఫోటోలతో ఉన్న వాల్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటికే జిల్లాలో పది మంది మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో ప్రత్యేక బృందాలతో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
ఇప్పటికే మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న రాజకీయ నాయకులు, ఇన్‌ఫార్మర్‌లను అప్రమత్తం చేశారు పోలీసులు. అటవీ గ్రామాలవైపు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక మావోయిస్టులు అమాయక ప్రజలను ఇన్‌ఫార్మర్ల నెపంతో టార్గెట్ చేస్తూ చంపడం దారుణమన్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దని సూచిస్తున్నారు. మావోయిస్టుల సమాచారం అందించనవారికి.. వారిపై ఉన్న రివార్డును జిల్లా ఎస్పీ అందజేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com