POLICE: పోలీసమ్మా.. నీకు వందనం

సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా రాజన్న వినూత్న కార్యక్రమం చేపట్టారు. వివిధ సన్మానాలు, సత్కారాల సందర్భంగా అందిన శాలువాలతో చిన్నారుల కోసం గౌన్లు కుట్టించి పంపిణీ చేశారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని బేడ, బుడగ, జంగాల కాలనీల చిన్నారులకు టౌన్ సీఐ వీరప్రసాద్తో కలిసి ఈ గౌన్లను ఏఎస్పీ స్వయంగా అందజేశారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ.. తనకు అందిన గౌరవాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సన్మానాల సందర్భంగా ఇచ్చే శాలువాలు, కండువాలు వృథా కాకుండా గౌన్లు కుట్టించి చిన్నారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు ఏఎస్పీ చర్యను ప్రశంసిస్తూ, ఇతరులు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొందాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. శాలువాలు గౌరవంగా తీసుకోని ప్రేమగా చిన్నారులకు ఇచ్చిందని నెట్టింట ప్రశంసలు కురిపించారు.
సాధారణంగా అధికారులకు సన్మాన కార్యక్రమాల్లో శాలువాలు అందిస్తారు. ఆ శాలువాలను భద్రపరుచుకోవడం బదులు వాటిని ఉపయోగకరంగా మార్చాలన్న ఆలోచన శేషాద్రిని రెడ్డికి వచ్చింది. అందుకే ఇప్పటివరకు తనకు వచ్చిన సన్మాన శాలువాలతో చిన్నారుల కోసం అందమైన గౌన్లు కుట్టించి వారికి అందించారు. ఆ గౌన్లు వేసుకున్న పిల్లల ముఖాల్లో మెరిసిన చిరునవ్వులు చూసిన ఆమె కళ్లలో సంతోషం కనిపించింది. తనకు గౌరవంతో ఇచ్చిన శాలువాలు ఇప్పుడు ఈ చిన్నారుల చిరునవ్వులుగా మారాయి. ఇది తన కెరీర్లో గుర్తుండిపోయే క్షణం అని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. ఆమె ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా చేపట్టడం విశేషం. ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచే ఈ చర్యకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బుడగ జంగాల కాలనీ గతంలో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతం. ఆ సమయంలో కూడా శేషాద్రిని రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

