ముగ్గురు కొడుకులు కాదన్నారు.. మూడు రోజులైంది అన్నం తినక

ముగ్గురు కొడుకులు కాదన్నారు.. మూడు రోజులైంది అన్నం తినక
85 ఏళ్ల వృద్దుడు భుజం మీద ఉన్న తువ్వాలుతో కళ్లొత్తుకున్నాడు.

భగవంతుడా.. బ్రతుకు ఇంత భారమవుతుందా.. కలలో అయినా ఊహించలేదే.. కాలు చెయ్యీ బావున్నప్పుడే కష్టపడాలని అయిదెకరాలు సంపాదించాను.. అయిదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకువచ్చాను. వృద్ధాప్యంలో ఉన్న నన్ను నిర్ధాక్షణ్యంగా వదిలేశారు.. ఆకలికి తాళ లేక అటు ఇటూ చూస్తుంటే.. ఎవరు కన్న బిడ్డలో ఈ పోలీసు బాబులు.. పట్టెడన్నం పెట్టి నా కడుపు నింపారు. దేవుడు సల్లగా సూడాలని దీవించాను.. అంతకంటే నేనేమి చేయగలను అంటూ ఆ 85 ఏళ్ల వృద్దుడు భుజం మీద ఉన్న తువ్వాలుతో కళ్లొత్తుకున్నాడు.

రోజూ ఎక్కడో ఒకచోట కనిపించే దృశ్యాలే అయినా.. మనసనేది లేకుండా మార్పనేది రాకుండా కన్న తల్లిదండ్రుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్లు పెద్దైన తరువాత వారి పరిస్థితీ అలానే ఉంటుందని ఊహించలేకపోతున్నారు. కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు(85)కు అయిదుగురు సంతానం. ఐదెకరాల వ్యవసాయ భూమిని విక్రయించి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఇద్దరిలో ఒక కూతురు అనారోగ్యంతో మరణించింది.

కొద్ది రోజుల క్రితం భార్య కూడా మరణించడంతో పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే తనకు కష్టంగా ఉందని.. తమ్ముళ్ల దగ్గరకు వెళ్లమంటూ తండ్రిని పంపించాడు. వాళ్లిద్దరు కూడా తండ్రిని భారంగానే భావించారు. చూడం పొమ్మన్నారు. దాంతో మూడు రోజులుగా తినడానికి తిండి లేక ఆకలితో అలమటించి చివరకు గురువారం రోజు పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్నాడు.

అయిన వాళ్లు ఉన్నా అన్నం పెట్టే వారు కరువయ్యారని ఆవేదన చెందాడు. ఆకలిగా ఉందనడంతో పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు వెంకటేశ్వర్లు భోజనం తెప్పించి పెట్టారు. కడుపు నిండా అన్నం పెట్టిన పోలీసులకు ఆ వృద్ధుడు చేతులెత్తి నమస్కరించాడు. వృద్ధాప్యంలో ఆయన పడుతున్న బాధను చూసి.. కొడుకులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు అతడికి భరోసా ఇచ్చారు. అందాకా స్టేషన్‌లోనే ఉండమంటూ ఆశ్రయమిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story