తెలంగాణ కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తోన్న రేవంత్ పాదయాత్ర

తెలంగాణ కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తోన్న రేవంత్ పాదయాత్ర
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ పాదయాత్ర చేస్తే కేడర్‌ మొత్తం ఆయన వెంట ర్యాలీ తీస్తుందనేమోనన్న భయం పార్టీ సినియర్లను వెంటాడుతోంది.

రేవంత్ రెడ్డి పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది. రాజీవ్ రైతు భరోసా దీక్షల పేరుతో సభలు ఏర్పాటు చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి.. సడెన్‌గా రూట్‌ మార్చుకున్నారు.. రైతు భరోసా దీక్షలను పాదయాత్రగా మార్చేశారు. చివరిగా రావిల్యాలలో ముగింపు సభ నిర్వహించి.. అదే వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నలు సంధించారు.. సొంత పార్టీలోనే వేరు కుంపటిలా మారిన సీనియర్లకు చురకలంటించారు. రావిల్యాల సభ ఊహించని రీతిలో సక్సెస్‌ కావడంతో రేవంత్‌ వర్గంలో సరికొత్త ఉత్సాహం కనబడుతోంది.. అదే సమయంలో టీ కాంగ్రెస్‌ సీనియర్లలో చర్చలు మొదలయ్యాయి.

రేవంత్ రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తారనే చర్చ పార్టీలో జరుగుతూ వస్తోంది. కానీ పాదయాత్రకు అధిష్టానం అనుమతి తప్పనిసరి కావడంతో ఎప్పటికప్పుడు తన పాదయాత్ర పై రేవంత్ స్పష్టత ఇవ్వలేకపోయారు. కొద్ది నెలల క్రితం అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని రేవంత్ హై కమాండ్ కోరినప్పటికీ సీనియర్లు అడ్డుపడ్డారు. వారు కూడా పాదయాత్ర కోసం అధిష్టానానికి విజ్ఞప్తులు పెట్టుకోవడంతో ఢిల్లీ నాయకత్వం హోల్డ్ లో పెట్టింది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ నేతలంతా రైతుల దగ్గరకు వెళ్లాలని సూచించడంతో దీనిని తనకు అనుకూలంగా మలచుకున్నారు రేవంత్. ఈ విషయంలో అందరి కంటే ముందు రియాక్ట్ అయిన ఆయన ఒకట్రెండు చోట్ల రాజీవ్ రైతు భరోసా దీక్షలు చేసి ఆ వెంటనే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనుకున్న ప్రకారమే పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసి.. ముగింపు సభతో పార్టీలో అందరినీ డైలమాలోకి నెట్టారు.

సొంత పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారికి తన స్ట్రెంత్ ఏంటో చూపించడానికి రేవంత్ తన పాదయాత్రను వాడుకున్నారు. జనంలో తనకు ఉండే ఆదరణని పార్టీ సీనియర్లతోపాటు ఢిల్లీ పెద్దలకూ చూపించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఫెయిల్ అవుతారంటూ పార్టీలో కొందరు సీనియర్లు చేస్తున్న ప్రచారానికి పాదయాత్రతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్. ఇక ఇదే అదునుగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం అని ప్రకటించారు రేవంత్. రావిల్యాల బహిరంగ సభకు హాజరైన పార్టీ నేతలు సైతం రాష్ట్ర పాదయాత్ర చేయాలంటూ రేవంత్‌ రెడ్డిని కోరారు. అయితే ఏఐసీసీ అనుమతి తీసుకున్న తర్వాతే పాదయాత్ర చేయాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. పది రోజుల పాదయాత్రతో పార్టీలో ప్రకంపనలు సృష్టించిన రేవంత్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రతో ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తారో అని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

రేవంత్ పాదయాత్ర ముగిసినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌లో మాత్రం ఆ హీట్‌ చల్లారడం లేదు. తాము కూడా పాదయాత్రకు సిద్ధమని పలువురు నేతలు పోటీ పడి ప్రకటనలు చేశారు. ప్రాజెక్టుల సాధన కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తానని ప్రకటించగా.. జగ్గారెడ్డి తాను సైతం సంగారెడ్డి నుంచి హైద్రాబాద్ కు పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. మరోవైపు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి పేరుతో రైతు బాట పట్టారు. ఇలా కాంగ్రెస్‌లోని ముఖ్యమైన నేతలంతా తామెక్క వెనకబడి పోతామో అని పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు.

రేవంత్ పాదయాత్రతో పార్టీలో ఆయన వర్గీయులు ఎవరు? ఆయన వ్యతిరేకులు ఎవరనేది స్పష్టత వచ్చినట్లే కనబడుతోంది.. రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు పీసీసీ చీఫ్ ఉత్తం, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వీహెచ్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, పొన్నాల, రాజనర్సింహ దూరంగా ఉన్నారు. అధిష్ఠానం అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా పాదయాత్ర చేస్తున్నారనేది వారి వాదన. అయితే, రేవంత్ పాదయాత్రకు జనం నుంచి వచ్చిన మద్దతు చూశాక బహిరంగంగా ఏమీ మాట్లాడక పోయినా ఇంటర్నల్ గా హైకమాండ్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నట్టు సమాచారం.

రేవంత్ పాదయాత్రకు చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నా.. పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులకు హుకుం జారీచేసినా.. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, క్యాడర్ రేవంత్ వెంట నడిచారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే కేడర్‌ మొత్తం ఆయన వెంట ర్యాలీ తీస్తుందనేమోనన్న భయం పార్టీ సినియర్లను వెంటాడుతోంది. సీనియర్ల నుంచి వ్యతిరేకత ఉన్నా.. రేవంత్‌ మాత్రం సభలో సంయమనంతో వ్యవహరించారు. బహిరంగ సభలో అందరు ముఖ్య నేతల ఫొటోలను ప్రముఖంగా పెట్టి తాను అందరితో సమన్వయం చేసుకుంటున్నాననే సంకేతాలను పంపించారు. భవిష్యత్తులో ఇతర నాయకులు చేపట్టే పాదయాత్రలకు తప్పక హాజరవుతానని ప్రకటించి.. పార్టీలో ఎవరితోనూ వైరం లేదనే క్లారిటీ ఇచ్చారు. ఎంతలా పక్కన పెట్టాలని చూసినా గోడకు కొట్టిన బంతిలా రేవంత్ లేస్తుండంతో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో తెలియక పార్టీ సీనియర్లు అయోమయంలో పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story