రాష్ట్ర రాజకీయం దుబ్బాక చుట్టు తిరుగుతుంటే..ఇతర పార్టీ నేతలు బీజేపీ చుట్టు తిరుగుతున్నారా?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు కమల దళం ఉన్న అన్నీ వ్యూహాల్నీఅమలు చేస్తోంది. గెలుపు ఓటములను పక్కన పెడితే పార్టీలో నూతన ఉత్సాహం నింపుతోంది. అదేవిధంగా ఇతర పార్టీలనుంచి నేతలు కాషాయం గూటికికి చేరేలా చేస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ జోరు వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీనుంచి కొంతమంది నేతలు కాషాయ గూటికి వచ్చేందుకు రంగం సింద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాములమ్మ కమలం గూటికిరావడం కన్ఫామ్ కావడంతో ... కాంగ్రెస్ నుంచి మరికొంతమంది నేతలు కాషాయ కండువ కప్పుకునేందుకు రంగం సిద్దంచేసుకుంటున్నట్లు సమాచారం. వారంతా ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చర్చజరుగుతోంది. రాములమ్మకోసం కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్రచీఫ్ బండి సంజయ్,డీకే అరుణలు సంప్రదింపులు జరిపి రాములమ్మ చేరికకు అంతా సిద్దంచేసినట్లు తెలుస్తోంది. రాములమ్మ రావడమే తరువాయి..మరికొంతమంది ఆమెను అనుసరిస్తారని సమాచారం.
అయితే గతంలో కిషన్ రెడ్డి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. నగరానికి చెందిన మరో మాజీ మంత్రి కుమారుడితో పాటు ... ఆ పార్టీ కీలక నేత, గతంలో ఉన్నత పదవి అనుభవించిన ఆయన కూడా పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనంతటిని క్షేత్ర స్థాయిలో డీకే అరుణ స్కెచ్ వేస్తుంటే .. జాతీయ స్థాయిలో వారి రాకకు రూట్ మ్యాప్ ను కిషన్ రెడ్డి సిద్దం చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. వీరే కాకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ పనితీరు, ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక ఈ పార్టీలో ఏమీ లేదన్న విషయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ వైపు చూస్తున్నారు. అరుణ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు జంప్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ లలో పనిచేసిన నేతలు కూడా ఉన్నారని డీకే అరుణ సన్నిహితులు, పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం మొత్తం దుబ్బాక చుట్టు తిరుగుతుంటే.. ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీ చుట్టు తిరుగుతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అనూహ్యంగా నలుగురు ఎంపీలు గెలిచిన తరువాత బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు క్యూ కట్టారు. ఆ తరువాత జరిగిన పంచాయితీ, లోకల్ బాడీల్లో బీజేపీ అంతగా ప్రభావం చూపక పోవడంతో చేరికలకు బ్రేక్ పడింది. తాజాగా దుబ్బాకలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ తో సై అంటే సై అంటుండటం, కాంగ్రెస్ అక్కడ నామమాత్రపు ప్రచారానికి పరిమితం కావడంతో మరోసారి బీజేపీలోకి వలసలు ప్రారంభం అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ దుబ్బాక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరెవరు కాషాయ గూటికి వస్తారనేదానిపై ఓ క్లారిటీ రానుంది.
ఒక జాతీయ పార్టీ నుంచి మరో జాతీయ పార్టీలోకి జంప్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేతలు భావించడం, రెండవది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఏదో ఒక రకంగా ఉన్నత పదవులు కట్టబెట్టడం. ఇదే ఇతరపార్టీ నేతలకు ఆశలు కల్గిస్తోంది. అయితే పార్టీ వలసలను బీజేపీ నేతలు ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com