హస్తం పార్టీకి సవాల్‌గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు

గతమెంతో ఘనం.. వర్తమానం దయనీయంలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గతంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు విజయమో..వీరస్వర్గమో అన్నట్లు పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. దుబ్బాక బై పోల్‌లో ఏకంగా డిపాజిట్ గల్లంతయ్యింది. గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాల్లో.. కేవలం రెండే గెలుచుకుంది. అవి కూడా సదరు వ్యక్తుల వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచిన స్థానాలే.. చాలా చోట్ల థర్డ్ ప్లేస్‌లో ఉంటే.. ఇంకా కొన్ని స్థానాల్లో డిపాజిట్‌లు దక్కకుండా పోయాయి.
దుబ్బాక..గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి..కాస్త సేదతీరొచ్చనే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఈ ఎన్నికలు నిజంగానే కాంగ్రెస్‌కు సవాల్‌గా మారాయి. మిగతా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌ను, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఐతే..ఉమ్మడి 3 జిల్లాలో ఒక్కో అభ్యర్థికి ప్రచార సమయం సరిపోని.. ఓటర్లలందర్నీ కలవడం సాధ్యం కాని పరిస్థితి ఉంది. దీనికి తోడు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు.. అభ్యర్థులకు సహకరించని తీరు కూడా కన్పిస్తోంది. మరోవైపు.. సభ పెట్టామా...ముగించామా అన్న తీరుగా ప్రచారం సాగుతుండడం ఆ పార్టీ నేతల్లో కలవరం కల్గిస్తోంది. ఐతే.. చిన్నారెడ్డి తరపున రేవంత్ రెడ్డి.. రాములు నాయక్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మిగతా నాయకులు పెద్దగా కన్పించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులందరూ సమిష్టిగా పని చేస్తున్నట్లు కన్పించడం లేదు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న బలమైన వాదాన్ని తీసుకు వెళ్లలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న గుబులు కాంగ్రెస్‌లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితి ఉందని భావిస్తున్న నేతలు.. ఎమ్మెల్సీ ఫలితాలు హస్తం పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం సాగర్‌పైనా పడుతుందని కంగారు పడుతున్నారు.
మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ఎమ్మెల్సీ ఎన్నికల అగ్ని పరీక్షను కాంగ్రెస్ ఎలా పాస్ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com