17 Jun 2022 3:10 PM GMT

Home
 / 
తెలంగాణ / Basara IIIT Campus:...

Basara IIIT Campus: ఆగని నిరసనలు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అండగా నాయకులు..

Basara IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనతో యుద్ధ వాతావరణం నెలకొంది.

Basara IIIT Campus: ఆగని నిరసనలు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అండగా నాయకులు..
X

Basara IIIT Campus: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనతో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నాలుగోరోజు విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమైన 12 డిమాండ్లను లెవనెత్తిన విద్యార్థులు ..ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన ఆపేదిలేదంటూ పరిపాలన భవనం ముందు ధర్నాకు దిగారు.

వేల మంది విద్యార్థులు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. విద్యార్థులకు మద్దతుగా బాసరకు వెళ్తున్న పలు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు వెనక్కి పంపారు. అటు పోలీసుల కళ్లుగప్పి ఆర్టీసీ బస్సులో బాసరకు చేరుకున్న ఏబీవీపీ నాయకులు..ట్రిపుల్‌ ఐటీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తమను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు విద్యార్థులమంటూ ఐడీ కార్డులు ఇవ్వాలని అడిగినట్లు విద్యార్థి సంఘ నేతలు తెలిపారు. ఆందోళనను పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసరలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన సీపీఐ నేత నారాయణ..బిడ్డల్నికలువకుండా తల్లిదండ్రులను అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు.

అటు విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను.. బికనూర్‌ టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేయడమేంటని బండి సంజయ్ పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందన్న ఆయన..సమస్యలపై పోరాడుతుంటే విద్యార్థుల వసతిగృహంలో కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటన్నారు. వాళ్లేమైన తీవ్రవాదులా అని ప్రశ్నించారు.

మరోవైపు పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లిన పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాలి నడకన వచ్చి గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించిన రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించి డ్రామాలు చేయడం కాదని, సమస్యను పరిష్కరిస్తారా లేదా? అని రేవంత్ నిలదీశారు.

మరోవైపు ఓయూ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్ సతీష్‌కుమార్‌ను బాసర్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ఉత్తర్వులు జారీ చేయటంతో.. బాసర చేరుకొని ఆయన బాధ్యతలు స్వీకరించారు. అటు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో క్యాంపస్ గేటు వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి నేతలెవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్-భైంసా రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు..

Next Story