KCR BRS : కేసీఆర్ 'బీఆర్ఎస్' జాతీయ పార్టీపై ఎవరు, ఏమన్నారంటే..?

KCR BRS : కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తున్నాయి.. కేసీఆర్ రాజకీయ దురాశ కోసమే బీఆర్‌ఎస్ ఏర్పాటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను మభ్య పెట్టడానికే బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి, తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని, తెలంగాణ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
అటు బీజేపీ నేతలు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా అత్యంత అవినీతి మోడల్ పాలను చూపించిన దుర్మార్గుడంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి అన్ని రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారంటూ విమర్శించారు. అది ఎన్నటికీ సాధ్యం కాదన్నారు డీకే అరుణ.
ఇక కేసీఆర్ కొత్త పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో స్పందించారు.. బీఆర్‌ఎస్ ప్రకటనతో తెలంగాణకు, కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని మట్టిలో కలిపేసి ఉద్యమకారులను మరచిపోయేట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని ఆయన విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణీ చేయాలని పగటి కలలు కంటున్నారంటూ ఈటల రాజేందర్ ఫైరయ్యారు.
విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటే లెఫ్ట్ పార్టీలు మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. అయితే, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టి జనం మద్దతు పొందగలిగినప్పుడే గెలిచినట్టు అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మొత్తంగా విమర్శలు ఎన్ని వస్తున్నా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ పార్టీని మిగతా రాష్ట్రాలు ఎలా ఆదరిస్తాయన్నది ఆసక్తిని రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com